తెలుగు సామెతలు - Telugu Samethalu

Telugu Samethalu

Read all telugu samethalu, samethalu in telugu. 

Telugu samethalu


తెలుగు సామెతలు


* తంగేటి జుంటిని దాప ఎందుకు? (దాచుటెందుకు?)(జున్ను= తేనెతుట్టె).

* తంగేడు పూచినట్లు.

* తంటాలమారి గుఱ్ఱానికి తాటిపట్ట గోఱపము (గోఱపము=కోకుడు దువ్వెన).

* తండ్రి ఓర్వని బిడ్డను తల్లి ఓరుస్తుంది.

* తండ్రికదా అని తలాటి కీడ్చినట్లు.

* తండ్రి చస్తే పెత్తనం తెలుస్తుంది, తల్లి చస్తే కాపురం తెలుస్తుంది.

* తండ్రి తవ్విన నుయ్యి అని దానిలో దూకవచ్చునా?

* తండ్రిని చంపబోయిన పాపం, అత్తవారింటికి పోయి, అంబటికట్ట తెగేవఱకు ఉంటే పోవును.

* తండ్రి వంకవారు దాయాది వర్గమే.

* తండ్రి సేద్యం కొడుకు వైద్యం కూడు మధ్యం.

* తంతే దూదిపరుపు మీద పడ్డట్లు.

* తంతే బూర్ల (గారెల) గంపలో పడ్డట్లు.

* తంబళి అనుమానం తలతిక్కతో సరి.

* తంబళి తన లొటలొటె గానీ, ఎదుటి లొటలొట ఎరుగడు.

* తంబళ్ళ అక్కయ్య మొదుమూడి వెళ్ళను వెళ్ళాడు, రానూ వచ్చాడు.

* తక్కువజాతికి (వానికి) ఎక్కువకూడైతే తిక్క తెగులు.

* తక్కువనోములు నోచి, ఎక్కువ ఫలం రమ్మంటే వస్తుందా?

* తక్కువవాడికి నిక్కెక్కువ, తవ్వెడు బియ్యానికి పొంగెక్కువ.

* తక్కువ వానికి నిక్కులు లావు.

* తగపండిన పండు తనంత తానే పడుతుంది.

* తగవు చెప్పు ధర్మరాజా! అంటే, దూడా, బఱ్ఱె నాదే అన్నాడట.

* తగవు ఎలావస్తుంది జంగమదేవరా అంటే, బిచ్చం పెట్టవే బొచ్చుముండా అన్నాడట.

* తగవున ఓడినా,ముదిమిది చచ్చినా బంది లేదు.

* తగినట్లు కూర్చెరా తాకట్లమారి బ్రహ్మ.

* తగిలించుకోవడం సులభం, వదిలించుకోవడం కష్టం.

* తగిలిన కాలికే తగులును, నొగిలిన కొంపే నొగులును.

* తగు దాసరికీ, మెడపూసలకీ, అమ్మకన్న కాన్పుకు, అయ్య ఇచ్చిన మానవుకూ సరి.

* తగునే కఱకుట్లును జంక పొత్తమున్.

* తగులుకున్న మొగుడు, తాటిచెట్టు నీడ నిలకడలేనివి.

* తట్టాలో కాపురం బుట్టలోకి వచ్చె, బుట్టలో కాపురం బూడిదలో కలిసె.

* తట్టుకు తగాడినట్లు (తట్టుకు=నడుస్తున్నప్పుడు కాలికి తగిలే చిన్న దెబ్బ, తగాడు= తగవు చెప్పు, న్యాయం తీర్పు చేయు).

* తట్టెడు గుల్లల కొక దుడ్డుపెట్టు.

* తడిక కుక్కకు అడ్డం కానీ మనిషికి అడ్డమా?

* తడ(డి)క కొంపలో దీపాలు వెలుగవా?

* తడ(డి)క గట్టు గోడను తన్నరాదు.

* తడిక తీసినవాడిదే తప్పు.

* తడవకుండానే తెంచే అచ్చన్న కంటే తడిపితెంచే బుచ్చన్న కొంతమేలు.

* తడిక దాసరివలే. (తడిక=చిత్తూరు జిల్లాలో ఒక గ్రామం).

* తడిక దొబ్బింది ఎవరంటే ఆలులేనివాడు అన్నట్లు.

* తడికలేని ఇంట్లో కుక్క దూరినట్లు.

* తడి గుడ్డలతో గొంతు కోసినట్లు.

* తడిగుడ్డలో పేలాలు వేయించినట్లు.

* తడిసిగానీ గుడిసె కట్టడు, (కప్పుడు) తాగి(కి)గానీ మొగ్గడు.

* తడిసిగానీ గుడిసె వేయడు, తగిలికానీ ఎత్తు చేయడు.

* తడిసిల తక్కెడ, ఎండిన ధడా.

* తడిసిన (మంచపు) కుక్కి బిగిసినట్లు.

* తడిసి ముప్పందుము మోసినట్లు.

* తడిసి ముప్పందుము మోసేకంటే, తడవక పందుం మోసేది మేలు.

* తణుకుపోయి మాచారం వెళ్ళినట్లు.(చుట్టు దారిన పోవుటకు).

* తత్సమయానికి తడి ఇసుకే సరి- అని పలుదోమినట్లు.

* తద్దినం కొని తెచ్చుకొన్నట్లు.

* తద్దినం నాటి జందెం వలె.

* తద్దినం పెట్టెవాని తమ్ముని వలె.

* తద్దినానికి తక్కువ, మాసికానికి ఎక్కువ.

* తద్దినానికి భోజనానికి పిలిస్తే, రోజూ మీ ఇంట ఇట్లాగే జరగాలని దీవించాడట.

* తనాన్నం తాను తింటూ, తనగుడ్డ తాను కట్టుతూ, ఊరికి భయపడవలెనా?

* తన కంట్లో దూలం పెట్టుకొని, పరుల కంట్లో నలుసులెంచినట్లు.

* తనకంపు తన కింపు, ఒకరికంపు ఒకరింపు.

* తన కంపు తనకింపు, పెఱకంపు తను జంపు.

* తన కలిమి ఇంద్రభోగం, తనలేమి స్వర్గలోకదారిద్ర్యం, తన చావు జలప్రళయం- అనుకొన్నట్లు.

* తనకాళ్ళకు తానే మొక్కుకొన్నట్లు.

* తనకు అని తవ్వెడూ ఉంటే, ఆకటివేళకు భుజించవచ్చు.

* తనకుగానిది గూదలంజ(బోడిముండ).

* తనకుగాని రాజ్యం పండితేనేమీ? మండితే (ఎండితే) నేమి?

* తనకుగాని ఆలు దానవురాలురా.

* తనకుచెప్ప తడికెల చాటు, ఒకరికిచెప్ప ఒప్పులకుప్ప.

* తనకు తోచకున్న మొకాటుతోనైనా ఆలోచించమన్నారు.

* తనకు పాసిన వెంట్రుకలు ఏరేవులో పోతేనేమీ?

* తనకు బుట్టినిల్లు తనరు కైలాసంబు.

* తనకుమాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం.

* తనకు ముక్తిలేదు తలపులు మెండైన.

* తనకు రొట్టె, ఇతరులకు ముక్క.

* తనకులేక తంటాలు పడుతుంటే, తొంటికాళ్ళ పిల్లి వెంటపడినట్లు.

* తనకు లేదని ఏడ్చి ఒక కన్నుపోతే, ఎదుటివారికున్నదని ఏడ్చి ఇంకొక కన్ను పోయిందట.

* తన కొంగున కట్టిన రూక, తన కడుపున పుట్టిన బిడ్డ.

* తనకోపమె తన శత్రువు.

* తన గుణము మంచిదైతే, సానివాడలో కూడా కాపురం చెయ్యవచ్చును.

* త గుద్దకింద నలుపు గురిగింజ కేమితెలుసు?

* తనగుద్ద కాకుంటే కాశీదాకా దేకమన్నారు.

* తన గుద్ద గాయం కాకుంటే, తాటియీనెలకు ఎదురు దేకమన్నారు.

* తన చల్ల పుల్లనిదని తానే చెప్పుకుంటాడా?

* తన చావు జలప్రళయం.

* తన చెయ్యి కాలుతుందని, సవతిబిడ్ద చేతితో కలియబెట్టిందట.

* తన తనయ ప్రసవ వేదనకోర్వలేకుంటే, తన అల్లునిపై అహంకారపడనేల?

* తనతప్పు తప్పుకాదు, తనబిడ్ద దుడుకుకాదు.

* తన తలుపుతీసి పొరుగింటికి పెట్టి రాత్రంతా కుక్కలను తోలుతూ కూర్చున్నట్లు.

* తనదని తవ్వెడు తవుడూన్నా ఆకటివేళకు తినవచ్చు.

* తనదాకా వస్తేకానీ, తలనొప్పి బాధ తెలియదు.

* తనదూడ పొదుగుకుమ్మి పాలుతాగితే ఊరుకుంటుందికానీ, పరాయిదూడ పాలుతాగితే ఊరకుంటుందా?

* తనదాకా వస్తే తగవే లేదు.

* తనది తాటాకు, ఇవతలవాళ్ళది ఈతాకు.

* తన దీపమని ముద్దుపెట్టుకుంటే, మూతిమీసాలన్ని కాలినాయట.

* తనదు కాలిగోయ తనతమ్ముడేడ్చునా?

* తనదు మేలుకీడు తనతోడనుండురా.

* తననీడ తప్పితే, తరుగునొక వన్నె.

* తననీడ తానే తొక్కుకున్నట్లు.

* తనను కట్ట త్రాళ్ళు తానే తెచ్చుకొన్నట్లు.

* తననోటికి తవుడు లేదు, లంజనోటికి పంచదారట.

* తనపిల్ల గంజికేడిస్తే, లంజపిల్ల దాని రేక కేడ్చిందట (రేక=తాటిఆకుతో కట్టిన పెద్దదొప్ప).

* తనపుట్టి పిచ్చగా ఉంటే, పొరుగుపందుంతో అపరాలు కొలిచినాడట (పిచ్చ=తక్కువ కొలత కలిగిన కొలపాత్ర, అపరాలు=కాయధాన్యాలు).

* తన పెరటిచెట్టు మందుకు పనికిరానట్లు.

* తన బలిమికన్నా స్థానబలిమి మిన్న.

* తన బుద్ధి మంచిదైతే, లంజగేరిలో ఇల్లు కడితేనేమి? (లంజగేరు=నాగవాసం, బోగమువాడ).

* తనభార్య విరహవేదన జారుడెరుగునా?

* తనలో తప్పులేకపోతే, గురువుతో గుద్దులాడవచ్చును.

* తనముడ్డి కాకపోతే గంగదాకా దేకమన్నట్లు.

* తనముడ్డి(కి) కాకపోతే తాటిపట్టుకు ఎదురుడెక మన్నట్లు.

* తనయుని పుట్టుక తల్లి ఎఱుగును.

* తనవృఇ కెంతకలిగిన తనభాగ్యమే తనది.

* తనవారిని ఎఱుగని మొఱ్ఱి తెడ్డున్నదా?

* తనవారు లోతుకు తీతురు, కానివారు కడకు (గట్టుకు) తీతురు.

* తనవాసి తప్పితే తన వన్నె తరుగుతుంది.

* తనసొమ్ము అయినా దాపుగా తినవలె.

* తన సొమ్ము అల్లం, పెరవారి సొమ్ము బెల్లం.

* తన సొమ్ము కాసుబెట్టడు కానీ పరులసొమ్ము హరింప (కాజేయ) బ్రహ్మకాయ.

* తనసొమ్ము తను దిని, తన బట్ట తను కట్టి, సావిట్లో వానితో చావు దెబ్బలు తిందిట.

* తన సొమ్ము సోమవారం, మందిసొమ్ము మంగళవారం.

* తనుగాక తన కొక పిల్లట.

* తనువు తాను కాదనువానికి తపసుచేయనేల?

* తనువులు నిత్యం కావు మా వారిని ఓలిపైకం ఖర్చు పెట్టవద్దని చెప్పమన్నట్లు.

* తనువు వెళ్ళినా దినము వెళ్ళదు.

* తన్ని తల్లే గుంజుకుపోతే, చెప్పున కొట్టి చిప్ప తెచ్చుకోవాలి.

* తన్నితే తల పగులుతుంది, కొడితే కొప్పెర పగలాలి అంటాడు.

* తన్నితే పోయి బూరెల గంపలో పడీనట్లు.

* తన్నుగట్ట తాళ్ళు తానే తెచ్చుకొన్నట్లు.

* తన్ను తప్పించి, ఆకాశమంత పిడుగు పడమన్నట్లు.

* తన్నుదా పొగడుకుంటే, తన్నుకొని చచ్చినట్లుంటుంది.

* తన్నే కాలికి రోకలి అడ్డమైనట్లు.

* తపము పండినమీద జడలు తాల్చడమెందుకు?

Telugu Samethalu


* తప్పతాగి కులము మఱచినట్లు.

* తప్పించబోయి తగిలించుకొన్నట్లు.

* తప్పు చేసినవానికి అప్పు చేసిన వానికి ముఖం చెల్లదు.

* తప్పుడు దండుగకు తలో యింత.

* తప్పులు వెతికేవాడు తండ్రి, ఒప్పులు వెతికేవాడు ఓర్వలేనివాడు.

* తప్పులెన్నువారు తండోపతండాలు.

* తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు.

* తప్పులేనివానిని ఉప్పులో వెయ్యమన్నట్లు.

* తప్పులేనివారు ధరణిలో లేరు.

* తప్పూ ఒప్పూ దైవమెఱుగును, పప్పూ కూడూ బాపడెరుగును.

* తప్పెటకొట్టిన వాడు దాసరి, శంఖమూదినవాడు జంగము.

* తప్పెట కొట్టినా పెండ్లే, చప్పెటకొట్టినా పెండ్లే.

* తమ తమ నెలవులు దప్పిన తమ మిత్రులే శత్రువులగుట.

* తమలంలో సున్నమంతటివాడు, తక్కువైనా ఎక్కువైనా బెడదే.

* తమ వంశగౌరవాన్ని గుర్తుంచుకొననివి గాడిదలు మాత్రమే.

* తమంలేకున్న తల్లినిపిల్లలే పరిహాస మాడుకుంటారు.

* తమాం లేదంటే, తవ్వెడైనా ఇవ్వమన్నట్లు.

* తము(మ)లపాకుతో తా నిట్లంటే, తలుపు చెక్కతో నేనిట్లంటి.

* తము(మ)లము వేయని నోరు, కమలము లేని కోనేరు.

* తమ్ముడు తనవాడైనా, ధర్మం సరిగా చెప్పవలె.

* తరవాణి తల్లి (తరవాణి=పుల్లనీళ్ళు, కలికుండ).

* తరి ఉంటే, వరి అంటారు (తరి=మాగాణి, మబ్బు).

* తరి పట్టిన కఱ్ఱ, చెరపట్తిన కుఱ్ఱ.

* తరి మెడకు ఉరి.

* తఱిమి చల్లితే తవ్వెడే.

* తలంత బలగమే కానీ తలలో పెట్టువారు లేరు.

* తల ఊపినందుకు తంబూరా బుఱ్ఱ ఇచ్చిపొమ్మన్నట్లు.

* తలకాయ లోపలికి దూర్చిన తాబేలు వలె.

* తలకింది కొఱవి వలె.

* తలకు చెప్పులడిగినట్లు.

* తలకు దాకకున్న, తనకేమి తెలియదు.

* తలకు దారిలేదు, బుడ్డకు అటకలి.

* తలకు మించిన శిక్ష, గోచికి మించిన దారిద్ర్యం లేవు.

* తలకు వచ్చిన భాదను తలపాగా మోసినట్లు.

* తలకోసి ఇచ్చినా పుచ్చకాయ అనేవాడు.

* తలకోసి ముందర పెట్టినా గారడివిద్యే అన్నట్లు.

* తలకోసుకుపోగా తమ్మపోగుల కేడ్చినట్లు.

* తలగడ కింద త్రాచుపాము వలె.

* తలగడ తిరుగవేస్తే తలనొప్పి తీరునా?

* తలగొట్టేవానికైనా మూడు మనవు లుంటాయి.

* తల గొరిగించుకున్న తరువాత తిధి నక్షత్రం చూచినట్లు.

* తలగోసి మొల వేసినట్లు.

* తలచినప్పుడే తాత పెళ్ళి.

* తల చుట్టం, తోక పగ.

* తల తడవి బాసచేసినా వెలయాలిని నమ్మరాదు.

* తల తడిపిన మట్టుకు గొరిగి తీరవలె.

* తల తిరిగి ముద్ద నోటికి వచ్చినట్లు.

* తల దన్నేవాడు పోతే, తాడి దన్నేవాడు వస్తాడు.

* తలదాచుకొన చోటిచ్చిన వానికే తావు లేకుండా చేసినట్లు.

* తల నరకడంలో, మొల నరకడంలో తారతమ్యమేమిటి?

* తల నరికె వానికి తలవారిచ్చినట్లు (తలవారు=పెద్ద కత్తి, తల్వార్-హింది).

* తలనొప్పి తగిలిందని తలగడ మార్చినట్లు.

* తల పడేచోటికి కాళ్ళు ఈడ్చుకొనిపోవును.

* తలపాగా చుట్టలేక తలవంకర అన్నట్లు.

* తలప్రాణం తోకకు వచ్చినట్లు.

* తలంబ్రాలకు తద్దినాలకి ఒకే మంత్రమా.

* తలంబ్రాలనాటి త్రాడు తానుపోయిన నాడే పోతుంది.

* తల మాసినవాడెవడంటే ఆలి(లు)చచ్చినవాడు అన్నట్లు.

* తలరాత(వ్రాత) తప్పించుకోరానిది.

* తలరాతేగాని, తనరాత ఎక్కదు.

* తలలు బోడులైన తలపులు బోడులా?

* తలపులు బోడులైన దక్కునా తత్వంబు.

* తలలో నాలుక, పూసలలో దారము వలె

* తలవంచుకుంటే, ఏడు గోడల చాటు.

* తలవరిదగు పొందు తలతోడ తీరురా.

* తల విడిచి మోకాలికి బాసికం కట్టినట్లు.

* తల వెంట్రుకలంత బలగమున్నా తల కొఱవి పెట్టె దిక్కులేదు.

* తల వెంట్రుకలున్నమ్మ ఏకొప్పు అయినా పెట్టవచ్చు.

* తలాతోకా లేని కత, ముక్కు మొగము లేని పిల్ల.

* తలారి దుప్పటి రెడ్డి బహుమానం చేసినట్లు.

* తలారి పగ తలతో తీరును.

* తలారి రుమాలు రెడ్డి చదివించినట్లు.

* తలుగు తెంచుకున్న బఱ్ఱె, తాడు తెంచుకున్న గుఱ్ఱం.

* తలుగు దొఱకిందని ఎనుమును కొన్నట్లు.

* తలుగు పెట్టి తంతూ ఉంటే, కొలువు పెట్టి కొలిచినట్లు.

* తలుచుకున్నప్పుడే తలంబ్రాలు కావాలంటే ఎలాగు?

* తలుపు పెట్టి చెబుతుంటే, కొలుపు పెట్టి అడుగుతాడు (కొలుపు=పశుబలి లేని జాతర, గలాబా).

* తలుపులు మింగేవానికి అప్పడాలు లొటలొట.

* తలుపొకరింటికి తీసిబెట్టి తా కుక్కలు దోలినట్లు.

* తలుపేల చాపగుడిసెకు.

* తలుము-తక్కువవాడు పనికిముందు వంగి, పనికాగానే నిగుడుకొంటాడు (తలుము=ఏతము).

* తల్లి అయినా ఏడవందే పాలివ్వదు.

* తల్లి ఓర్చనిది దాది ఓర్చునా?

* తల్లి కడుపు చూచును, పెళ్ళాం వీపు(జేబు) చూచును.

* తల్లి కడుపులోచోరక ముందు దెయ్యాల దేవత, భూమిలో పుట్టిన తరువాత యమదేవత.

* తల్లి కాకపోతే తిళ్ళికకు దణ్ణం పెట్టమన్నారు.

* తల్లికి కానినాడు దాదికవునా?

* తల్లికి కూడుపెట్టనివాడు తగుదునని తగవు తీర్చవచ్చాడట.

* తల్లికి కూడు పెట్టనివాడు తగవు చెప్పేడు (చెప్పును), పెళ్ళానికి చాలనివాడు పెత్తనం చేసేడు (చేయును).

* తల్లికి కూడు పెట్టనివాడు పినతల్లికి చీరపెట్టాడుట.

* తల్లిని కొట్టరా వసంతం అన్నట్లు.

* తల్లికి తగిన బిడ్డ, ఇంటికి తగిన పందిరి.

* తల్లికి తప్పిన వానికి పినతల్లి శష్పసమానం(శష్ప మర్యాద).

* తల్లికి బొల్లి ఉంటే, పిల్లకు చుక్కయినా ఉంటుంది.

* తల్లికి లేని ముద్దు దాదికి కలుగునా?

* తల్లికి వంచగలిగిన పిల్లకు బొక్క కలుగుతుంది (బొక్క=మూలుగ ఎముక).

* తల్లి కొద్ది బొల్లి కోడె.

* తల్లిగండం, పిల్లగండం ఉన్నదికానీ, మధ్యన మంత్రసాని గండమున్నదా?

* తల్లిగల లంజను తగులుకొనుటే తప్పయా.

* తల్లిగారింటినుంచి వచ్చిందని కుక్కమూతికి సద్దికట్టి పంపుతారా?

* తల్లి గూనిదయితే తల్లిప్రేమ గూనిదవుతుందా?

* తల్లిగుణము కూతురే బయటపెడుతుంది.

* తల్లి చచ్చినా మేనమాముంటే చాలు.

* తల్లి చచ్చిపోతే తండ్రి పినతండ్రితో సమానము.

* తల్లిచస్తే కడుపు పెద్ద, తలలు మాస్తే కొప్పు పెద్ద.

* తల్లి చస్తే తరంబాసె, తండ్రి చస్తే ఋణంబాసె.

* తల్లి చస్తే నాలిక చచ్చినట్లు, తండ్రి చస్తే కళ్ళుపోయినట్లు.

* తల్లి చాలి పిల్లకు తప్పుతుందా?

* తల్లి చెవులో మద్దికాయలు దండుగలకు, భార్య మెడలో పూసలు బందుగులకు (భోగాలకు).

* తల్లి చెవులు తెంపినవానికి, పినతల్లి చెవులు బీరపువ్వులు.

* తల్లి చేను మేస్తే, పిల్ల మేర మేస్తుందా?

* తల్లి చేల్లో మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా?

* తల్లి తర్పణానికే తక్కువైతే, పినతల్లికి పిండప్రదానమట.

* తల్లితండ్రీ లేని బాల తననాధునే కోరును.

* తల్లితండ్రులు, అన్నదమ్ములున్నా పొలతికి పురుషుడు కొదవే.

* తల్లిదే సంరక్షణ, ధరణిదే వలపక్షం.

* తల్లి దైవము, తండ్రి ధనము.

* తల్లిని చూచి పిల్లను, పల్లును చూచి పశువును కొనవలె.

* తల్లిని చూచి పిల్లను, తరిని జూచి బఱ్ఱెను (తరి= వెన్న ఎక్కువగా కలిగిన పాలు).

* తల్లిని చూచి పిల్లను, పాడిని (పొదుగును) జూచి బఱ్ఱెను.

* తల్లిని తిట్టకురా నీయమ్మనాయాల అన్నట్లు.

* తల్లిని నమ్మినవాడు, ధరణిని నమ్మినవాడు చెడడు.

* తల్లిబట్టి పిల్ల, విత్తునిబట్టి పంట.

* తల్లిబట్టి పిల్ల, నూలునుబట్టి గుడ్డ.

* తల్లిపాలు దూడ చెప్పును.

* తల్లి పిత్తి పిల్లమీద పెట్టిందట.

* తల్లి పిల్ల వన్నెకాదు, వండిపెట్ట దిక్కులేదు.

* తల్లి పుట్టిల్లు మేనమామ వద్ద పొగడినట్లు.

* తల్లి పుస్తి బంగారమైనా అగసాలి దొంగిలించకుండా ఉండలేడు.

* తల్లి పెంచవలె, ధరణి పెంచవలె గానీ పెరవారు పెంచుతారా?

* తల్లి పైచేయిజూచు తగు పంటలల్లూరు.

* తల్లిమాటలే గానీ, పెట్టుమాత్రం పినతల్లిది (సవతితల్లిది).

* తల్లి ముఖం చూడని బిడ్డ, వానముఖం చూడని పైరు.

* తల్లిమీది కోపం పిల్లమీద పోతుంది.

* తల్లిలేక పెరిగి ధాత్రి నెట్లేఎరా?

* తల్లిలేని పిల్ల - ఉల్లి లేని కూర.

* తల్లిలేని పిల్లలు, అల్లులేని తీగలు.

* తల్లిలేని పుట్టిల్లు, ఉల్లిలేని కూర.

* తల్లి విషం, పెండ్లాం బెల్లం.

* తల్లి వెనుక మేనమామ అన్నారు.

* తల్లి సారం పిల్ల, దాకసారం సక్కు.

* తల్లిలేని పిల్ల దెయ్యాల పాలు.

* తల్లీ, బిడ్డా ఒకటైనా, నోరు కడుపు వేరు.

* తల్లె కొట్టినా పెండ్లే, తప్పెట కొట్టినా పెండ్లే.

* తల్లే రోసిన దాది రోయదా?

* తవిటికి వచ్చిన చెయ్యే ధనానికి వస్తుంది.

* తవుటికి ఱంకాడబోగా కూటితపిలె కోతిగొంపోయినట్లు.

* తవుడు తాతా! అంటే, నూకలా ముసలమ్మా? అన్నట్లు.

* తవుడు తింటూ ఒయ్యారమా?

* తవుడుతిని చచ్చేవానికి విషంపెట్టేవాడు వెఱ్ఱి.

* తవుడు నోముపట్టిన అమ్మకు తరగని ఐదవతనము.

* తవుడూబొక్క తహసిల్దారుడు, మీసాలెగబెట్ట మాసూలుదారుడు (మాసూలు దారుడు= రైతుల దగ్గర ధాన్యరూపకంగా శిస్తు వసూలుచేయు ఉద్యోగి).

Telugu Samethalu


* తవుడు బొక్కినంతవరకే దక్కినట్లు.

* తవ్వగా తవ్వగా తథ్యం తేలుతుంది.

* తవ్వి మీద తోసుకున్నట్లు.

**********:: తా ::**********

* తాకట్ల మొగుడా! తంటాల మొగుడా! నీ తనువుండగానే నన్ను మనువిచ్చి పోరా.

* తాకబోతే తగులుకున్నట్లు.

* తాకున కాలికే బుడుసు(పు), తెగిన తాటికే ముడుసు (బుడుసు=బొబ్బ, ముడుసు=ముడి).

* తాకిన వేలికే తట్టు తగులుతుంది.

* తాకితే తగరు, ఈనితే గొఱ్ఱె.

* తాకి నేలకు తడిబ(బొ)ట్టు కానీదు, వంగి నేలకు ఇంగువ కానీదు.

* తాకి మొగ్గి తడిసి గుడిసె కప్పు (తాకి=అనుభవం కలిగి).

* తాకి మ్రొగ్గిన తనువంత ఒకటి, దీపము నులిపిన దినుసంత ఒకటి.

* తాగటానికి దప్పిక (గంజి) లేదుగానీ గుంటడికి గుండుజోడు.

* తాగనేరని పిల్లి బోర్ల పోసుకొన్నట్లు.

* తాగబోతే దప్పికకు లేదుకానీ, తలకు అటకలి (అటకలి=తలస్నానానికి మేలైన చమురు).

* తాగబోతే మజ్జిగలేదంటే, పెరుగుకు చిట్టి వ్రాయమన్నాడట.

* తాగితేగానీ మొగ్గడు, తడిస్తేగానీ కప్పడు.

* తాగిన దుక్కి తప్పక పండును (తాగిన=నీరుబాగా పీల్చిన)

* తాగినవాడి తప్పుకు తగవు లేదు.

* తాగినవాడు తప్పినవాడు ఒకటే.

* తాగినవానిదే పాట, సాగినవానిదే ఆట.

* తాగినవానిమాట దబ్బరగాదు.

* తాగిన రొమ్మే గుద్దినట్టు.

* తాగుటకు ముందు, వ్రాతకు వెనుక చూడవలె.

* తాగుబోతు తోడు కోరతాడు.

* తాగేది దమ్మిడి గంజాయి, ఇల్లంతా చెడ ఉమ్ములు.

* తాగేవాడే తాళ్ళపన్ను కట్టుతాడు.

* తాగేది గంజైనా స్నానమాడి తాగు; కట్టేది చింపైనా ఉతికికట్టు.

* తాచుపాము తామసము, జఱ్ఱిపోతు పిరికితనము కలవాడు.

* తాచెడ్డకోతి వనమెల్లా చెరిచె.

* తాచెడ్డ ధర్మం, మొదలుచెడ్డ బేరం.

* తాటంత వానిని తలదన్ను వాడుంటాడు

* తాటాకు చప్పుళ్ళకు కుండేళ్ళూ బెదరునా?

* తాటికాయ తింటావా? తలకొట్లు పడాతావా?

* తాటికాయ వన్నె తప్పుడిది.

* తాటిచెట్టు ఎక్కలేవు, తాటిగెల కోయాలేవు. తాతా నీకెందుకోయ్ పెండ్లాము.

* తాటిచెట్టుకింద పాలుతాగినా కల్లే అంటారు.

* తాటిచెట్టు నీడ నీడాగాదు, తలుగుకొన్న ముండా పెండ్లాం కాదు.

* తాటిచెట్టు నీడ నీడాగాదు, తలుగుకొన్నవాడు మొగుడూ కాదు.

* తాటిచెట్లకు గంధం పూసినట్లు.

* తాటోటుగాడికి దధ్యన్నం, విశ్వాసపాత్రునికి గంజన్నము (గంజికూడు).

* తాటిఎత్తు ఎగిరినానంటే తారాజు(చు)వెత్తు ఎగురు అన్నట్లు.

* తాడినెక్కేవాడిని ఎంతదాకా ఎగసనదోత్తారు?

* తాడికి తలబంటి అయితే (వె)ఎంపలికి ఎంతబంటి? అన్నట్లు.

* తాడి తన్నివానిని తలతన్నే వాడుకూడా ఉంటాడు.

* తాడు అని ఎత్తిపారేయకూడాదు, పాము అని దాటనూకూడదు.

* తాడుకు పట్టలేదు, తలుగుకు పట్టలేదు, గుంజకెందుకమ్మా గుంజలాత?

* తాడుతెంచను ముహూర్తమెందుకు?

* తాడుతో దబ్బనము.

* తాడూలేదు, బొంగరమూ లేదు.

* తాడులేకుండా బొంగరం తిప్పేవారు.

* తాత కట్టిన చెరువని దూకుతారా?

* తాతకు దగ్గులు నేర్పినట్లు.

* తాతా తాత! తంగెడుపుల్ల, ధు(ద)సినీ యక్క, కుందేలుపిల్ల.

* తాతదిన్న బొచ్చె తరతరా లుంతురా?

* తాతపోతే బొంత నాది.

* తాడుతెగిన గాలిపటం.

* తాడులేకుండా బొంగరం ఆడించేవాడు.

* తాతను చూపుతావా? తద్దినం పెడతావా?

* తాతలనాటి బొచ్చె తరతరాలకు.

* తాతలనాటి మూకుడు తరతరాలు మనాలన్నట్లు.

* తాతలనాడు నేతులుతాగాం, మూతులు వాసన చూడు.

* తాతాచార్ల తద్దినానికి, పీర్లపండుగకు ఏమి సంభందం?

* తాతాచార్యులవారి ముద్ర భుజంతప్పినా వీపు తప్పదు.

* తాతాచార్యు లేం జేస్తున్నారంటే, తప్పులు (వ్రాసి0 చేసి దిద్దుకుంటున్నారు.

* తాతా పెండ్లాడుతావా అంటే, నా కెవరిస్తారురా అబ్బాయి అన్నాడట.

* తాతా సంక్రంతి పట్టు పట్టు.

* తాతా సంధ్య వచ్చునా? అంటే, ఇప్పుడు చదువుకొన్న నీకే రాకపోతే అరవైఏళ్ళక్రితం చదువుకొన్న నాకు వచ్చునా అన్నాడట.

* తా త్రవ్విన గోతిలో తానే పడతాడు.

* తా దిన తవుడులేదు, వారాంగనకు వడియాలట.

* తాదూర సందులేదు, మెడకొక డోలు అన్నట్లు.

* తాను ఆడుదై గూడ నానబ్రాల కేడ్చిందట (నానబ్రాలు=బియ్యం నానబెట్టి బెల్లం, కొబ్బెర కలిపి తిను తినుబండారం)

* తాను ఆడుదై నానబ్రాల కేడ్వవలెనా?

* తాను ఉండేది దాలిగుంట పట్టు, తలచేవి మేడమాళిగలు.

* తాను ఎఱుగని కల్ల లేదు, తల్లి ఎఱుగని కులం లేదు.

* తాని ఒకటి తలిస్తే దైవ మింకొకటి తలచినట్లు.

* తానుగాక పిల్లి కూడానా?

* తాను చావడం జగం క్రుంగడ మనుకున్నదట ఒకనక్క.

* తాను చేసిన పాపం తనువుతో, తల్లి చేసినపాపం ధరణితో.

* తాను చొక్కమైనట్లు, తడక భద్రమైనట్లు.

* తాను దూరనే కంత లేదు, మెడకొక డోలా?

* తాను దొంగై, ఇంటిపై అనుమానపడినట్లు.

* తను దొంగైతే, ఇరుగు పొరుగును నమ్మడు.

* తాను పతివ్రత అయితే, సాని ఇంత కాపురముంటే మాత్రమేమి?

* తాను పెంచిన పొట్టేలు తనచేతనే చచ్చినట్లు.

* తాను పెంచిన పొట్టేలు తన్నే తఱిమి పొడిచినట్లు.

* తాను బట్టిన కుందేలుకు మూడే కాళ్ళు.

* తాను మింగేదాన్ని, తన్ను మింగేదాన్ని చూచుకోవలె.

* తాను మెచ్చ తినాలి, ఒకరు మెచ్చ నడవాలి.

* తాను మెచ్చింది రంభ, తాను మునిగింది గంగ.

* తానే తుమ్మి, తానే దీవించుకొన్నట్లు.

* తానే తుమ్మి, తానే శతాయుస్సు అనుకొన్నట్లు.

* తానే శెట్టి అంటే, మూడే గిద్దలంటాడు.

* తానే సెట్టి అంటే, మూడే సోలలు అమ్మినాడట.

* తానై మాగని కాయ, తంతే మాగునా?

* తానొకటి తలచిన దైవమొకటి తలచు.

* తాపుల గొడ్డుకు రోలడ్డమా?

* తా బెట్టుకోనిది భిక్షమా?

* తా బోతూ బొల్లెద్దుకు కుడితి అన్నట్లు.

* తా బోతే తాడు దొరకదుగానీ రాయరా సన్నాలకు చీటీ అన్నాడట.

* తా బోతే మజ్జిగ చుక్కకు గతిలేదు, చీటీవస్తే పెరుగు పంపుతారన్నట్లు.

* తామరాకుపై నీటిబొట్టు వలె

* తామసంబు నెంచు ధరలోన నధముండు.

* తాయిత్తులకే పిల్లలు పుడితే తా నెందుకు?

* తార్చినదానికి టంకము, వెళ్ళినదానికి ఏగాని.

* తాలిమి తన్ను కాచును, ఎదరినీ కాచును.

* తాలుకంకి గింజలోయి దాసరీ ! అంటే రాలినవఱకే గోవిందా ! అన్నాడట (తాలు=నీళ్ళులేక ఎండిపోయిన వరి కర్ర, అదివేయి తరకగింజల వెన్ను).

* తాలువడ్లకు నీళ్ళ కల్లుకు సరి.

* తాళపుచెవి లేక తలుపెట్టు లూడురా?

* తాళము నీవద్ద, చెవి నావద్ద.

* తాళ(చెవి)ము పోయినంత మాత్రాన పెట్టి తెరువలేమా?

* తాళిదెంచను శుభలగ్నము కావలెనా?

* తాళిబొట్టు బలంవలన తలంబ్రాలవరకు బ్రతికినాడు.

* తాళ్ళకు తలబంటి అంటే, వెంపలికి ఎంతబంటి అన్నాడట.

* తాళ్ళకు తలను చండ్లు, మేకలకు మెడను చండ్లు.

* తాళ్ళపాక చిన్నన్న రోమములు కాగానే తంబూరా దండెకు తంతులగునా?

* తాళ్ళపాకవారి కవిత్వం కొంత, తన పైత్యం కొంత.

**********:: తి ::**********

* తింటే ఆయాసం, తినకుంటే నీరసం.

* తింటే కదలలేను, తినకుంటే మెదలలేను.

* తింటేగానీ రుచి తెలియదు, దిగితేగానీ లోతు తెలియదు.

* తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి.

* తింటే బఠాణ, వింటే అఠాణ (రాగం).

* తింటే భుక్తాయాసం, నడీస్తే మార్గాయాసం.

* తింటే నారసం, తినకపోతే నీరసం.

* తింటే మీగడ తినాల, వింటే బేగడ వినాల (రాగం).

* తిండికి ఏనుగు, పనికి పీనుగు.

* తిండికి చేటు, నేలకు బరువు.

* తిండికి ఠికాణా లేదు, ముండకు బులాకి అట.

* తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు.

* తిండికి తీటకు మేరలేదు.

* తిండికి పిడుగు, పనికి బుడుగు.

* తిండికి ముందు కోపు, పనికి వెనుక కోపు (కోపు=పార్శ్వము, ప్రవేశము).

* తిండికి ముండు, దండుకు వెనుక.

* తిండికి ముందెత్తు, పనికి వెనకెత్తు.

* తిండికి లేకపోయినా తిక్కకేమి లోటు?

* తిండికి వచ్చినట్లా? తీర్ధానికి వచ్చినట్లా?

* తిండి చింత, దండి చింత.

* తిండిబోతు సంగతి పెండ్లామేరుగు.

* తింత్రిణీక మహిమ తినువా డెరుంగును.

* తిండిలేనమ్మ తిరనాళ్ళకు పోతే ఎక్కా దిగా సరిపోయింది.

* తిక్కపిల్ల తీర్ధంపోతూ, అక్కమొగుడిని వెంటబెట్టుకు పోయిందట.

* తిక్కప్ల్లా! తిక్కపిల్లా! మా అక్కపిల్లను చూస్తివా అంటే, చూస్తి- శుక్రవారమని కావలించుకొంటి, మాటలాడుదామంటే మఱచిపోతి అన్నదిట.

* తిక్కలవాడు తిరనాళకు పోతే, ఎక్కాదిగా ఏడునాళ్ళు పట్టిందట.

* తిట్టకురా తత్తుకొడుకా అన్నట్లు.

* తిట్టబోతే అక్కబొడ్డ, కొట్టాబోతే వేకటి మనిషి (వేకటి మనిషి=గర్భిణి).

* తిట్టితే చచ్చినవాడు లేడు, దీవించితే బ్రతికినవాడు లేడు.

* తిట్టితే కోపం, కొట్టితే నొప్పి.

* తిట్టితే గాలికి పోతవి, తింటే లోనికి పోతవి.

* తిట్టుకొక శృంగారమా?

* తిట్టే నోరు కొ(కు)ట్టినా ఊరకుండదు.

* తిట్టె నోరు, తినే నోరు, తిరిగే కాలు ఊరకుండవు.

* తిత్తికాసులు జెల్లె, తిడునాళ్ళ జెల్లె.

* తినక చవి, చోరక లోతు తెలియవు.

* తినకుండా రుచులు, దిగకుండా లోతులు తెలియవు.

* తిన కూటికి దారిలేదు కానీ,; తనవారికి తద్దినాలట.

* తినగతినగ వేము తియ్యనై యుండును.

* తినగల అమ్మ తిండి తీర్ధాలలో బయటపడుతుంది.

* తినగా తినగా గారెలు చేదు.

* తినబెట్తమంటే, వినబెట్ట మన్నట్లు.

* తినబోతూ రుచులడిగినట్లు.

* తిననేర్చినమ్మ పెట్టనేరుస్తుంది.

* తిమమంటే పులివల్లదు.

* తినమరిగిన కుక్క రేవు కాసిందట.

* తినమరిగిన కుక్క అలమరిగి చచ్చిందట.

* తినమరిగిన కోడి అలమరిగినదట. (అలమరుగు= అలమటించు)

* తిమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందట.

* తినమరిగిన ప్రాణం అల్లాడి చచ్చిందట.

* తిమమరిగినమ్మ వరిమడి దోవ పట్టినట్లు.

* తినా కుడువా తీర్ధం పోవాలి, తిండికి మాడ పెండ్లికి పోవాలి.

* తినాలేదు పట్టాలేదు బొట్టైనా పెట్టుకో.

* తిని ఉండలేను, తీసి బొందవెట్టు.

* తిని ఉండలేక, తాగి బొందను పడినట్లు.

* తిని కుడువ వలె, ఋణాలు పోవలె, పనిజేయి పెండ్లికి పోవలె.

* తినేకూటిలో మన్ను పోసుకొన్నట్లు.

* తినేది కుడుచేది తిమ్మక్క, మోసుకు తిరిగేది మొఱ్ఱెక్క.

* తినేది కుడిచేది (పెట్టేది) రెడ్డిసాని, (కనేది) కట్టేది గుడ్డిపోలి (కట్టుట= పశువుల గర్భధారణ).

* తినేది గొడ్డుమాంసం, చేసేది దేవతార్చన.

* తినేవరకు ఆకలికుట్టు, తిన్నతర్వాత దండికుట్టు.

* తినేవి తిప్పకాయలు, వెళ్ళగ్రక్కేవి వెలగకాయలు.

* తిన్న ఇంటి వాసాలు (లెక్కపెట్టు) ఎంచుతావేమిరా? అంటే పొరుగింటి సంగతి నాకేమి తెలుసు అన్నాడట.

* తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు.

* తిన్న ఇల్లు గుద్దలించా వేమిరా? అంటే, తినని ఇంట్లోకి రానిస్తారా అన్నాడట.

* తిన్న కుక్క తినిపోతే, కన్నకుక్కను కట్టేసినారంట.

53 తిన్న కుక్క తినిపోతే, కన్నకుక్కకు కాలు విరిగకొట్టినట్లు.

* తిన్నవాడే మన్నవాడు, మన్నవాడే మహరాజు.

* తిన్నోడికి తిండిబెట్టడాం, బోడిగుండోడికి తలకుబోయడం సులభం.

* తిప్పులాడీ! మా అవ్వను చూచినావా? అంటే, తీర్ధంలో మా బావను చూచినావా అన్నదిట.

* తిమ్మన బంతికి తియ్యని చారు-అన్నము (తిమ్మన్న=తిరుమల అన్న, వేకటేశ్వరుడు; కోతి).

* తిమ్మన్న బంతికి రమ్మంటారు కాబోలు.

* తిమ్మన్న! తిమ్మన్న! నమస్కారమంటే, నా పేరు నీకెలా తెలిసింది అంటే, నీ ముఖం చూడగానే తెలిసింది అన్నాడట.

* తిమ్మిని బ్రహ్మి, బ్రహ్మిని తిమ్మి చేసినట్లు.

* తియ్యగా తియ్యగా రాగం, మూల్గగా మూల్గగా రోగం.

* తియ్యటి తేనె నిండిన నోటితోనే తేనెతీగ కుట్టేది.

* తిరిగి ఆడుది, తిరుగక మగవారు చెడుదురు.

* తిరిగితే వరిపొలం, తిరుగకపోతే అడవిపొలం.

* తిరిగి రైతు, తిరుగక బైరాగి చెడుదురు.

* తిరిగివచ్చిన భార్య, తిరుగబోత (తిరుగమూత) వేసిన కూర బహురుచి (తిరుగబోత=తిరుగమాత=పోపు).

* తిరిగేకాలు తిట్టె నోరు ఊరుకోవు.

* తిరిపం పెట్టె అమ్మను మగనితోపాటు పెట్టమన్నట్లు.

* తిరివపుకూడు బర్కతు లేదు, తిన్నవఱకు నమ్మిక లేదు (బర్కతు=క;అసివచ్చుట).

* తిరివపు మజ్జిగకు వచ్చి, పాడిగేదెను బేరమాడినట్లు.

* తిరిప మెత్తేవానికి పెఱుగన్నం కరవా?

* తిరిపెపు అనుభవం తమి దీరదు.

* తిరిపెపు తిండి తింటే, మిట్టచేనుకు ఒడ్డువేసినట్లుండాల (ఎగదన్ని ఉండును).

* తిరిపెమున లేమి తీరుతుందా?

* తిరునాళ్ళకు (తీర్ధం) పోతూ తీసిపొమ్మన్నారు. పెండ్లికిపోతూ పెట్టుకో పొమ్మన్నారు.

* తిరుగనేర్చినవాడు ధీరుడై యుండురా.

* తిరుగ మరిగిన కాలు, తినమరిగిన నోరు ఊరుకోవు.

* తిరునాళ్లకు పోయివచ్చిన మొగం మాదిరి (అలసి సొలసి వచ్చును).

* తిరుపతి పోగానే తురక దాసరి కాడు.

* తిరుపతిలో పుట్టగానే దున్న గోవిందా అంటుందా?

* తిరుమణి పెట్టనేరిస్తే తీర్థాలు గడచినట్లు.

* తిరుమల్లయ్య సలహా, తిరుపతి వెంకన్న మ్రొక్కు.

* తిలాపాపం తలో పిడికెడు.

**********:: తీ ::**********

* తీగంటి (తీగవంటి) బిడ్డంటే, తెగ తెమ్మని ఏడ్చినదట.

* తీగ కదిలిస్తే, పొదంతా కదులుతింది.

* తీగకు కాయ బరువా?

* తీగ పెట్టినమ్మ మాట తియ్యగా, కమ్మపెట్టినమ్మ మాట కమ్మగా, విచ్చుటాకులున్నమ్మా! నీమాట విన సహించదు అన్నదట.

* తీగై వంగంది, మానై వంగుతుందా?

* తీటగలదానికి, తోటగలవానికి తీరిక ఉండదు.

* తీటబుట్టినవాడే గోక్కుంటాడు.

* తీటమ్మా! తీటమ్మా! నీ నొసలేమయ్యింది అంటే, తిరుమణి పెడితే పొక్కింది అందిట.

* తీట సిగ్గెరుగదు.

* తీతువపిట్ట కాళ్ళు తలక్రిందులుగా పెట్టి ఆకాశం పడకుండా చూస్తానన్నదిట (పట్టుకున్నానందట).

* తీతువపిట్ట రాయబారం (దుశ్శకునం).

* తీపి ఏదంటే- ప్రాణం.

* తీపునంటి ఈగ తెగువతో నీల్గును.

* తీపుల మాటలకు వీపులు గుంజుతవి.

* తీయడం పెట్తడం తీపులచేటు కనటం, కూచోవటం నొప్పులచేటు.

* తియ్యని నోర చేదు మేసినట్లు.

* తీరుతీరు గుడ్డలు కట్టుకొని తిరునాళ్ళకుబోతే, ఊరికొక గుడ్డ ఊసిపోయిందట.

* తీరోటి (తీరైన) మొగమని తిరిపానికి బోతే, తడవిచూసాడట.

* తీర్థము స్వార్థము కలసివచ్చినట్లు.

* తీర్థయాత్రతోడ దివ్యుండు కాడయా.

* తీసినవారు బాగానే ఉంటారు, తీయించుకున్నవారూ బాగానే ఉంటారు, ఎదురైనవారికి తగులుతుంది ఎదురుమిత్తి.

**********:: తు ::**********

* తుంగభద్రలో మునుగను తాతం భట్టాఙ్ఞా?

* తింగలో పిత్తితేమీ? తూటాకులో పిత్తితేమి?

* తుంటిమీద కొడితే నోటిపళ్ళు రాలాయట.

* తుప్పరల వస్తేగానీ మంత్రాల పసలేదు.

* తుట్టెపురుగు రెక్కలు వచ్చినా, ముసలివాడికి ప్రాయం వచ్చినా పట్టపగ్గాలుండవు.

* తుడుము కాడి(డ) నుంచి దేవతార్చనదాకా ఒకటే మాట (తుడుము=నగారా).

* తుడుము మొదలు దేవతార్చనదాకా ఒకేమాట (మంత్రం).

* తుదను దండుగనిడి మొదలుచెడు నరుండు.

* తుది దాకునే లోక విరుద్ద వృత్తముల్

* తుపాకి కడుపున ఫిరంగి పుట్టినట్లు.

* తుమ్మ ఉన్నచోటునే కమ్మ ఉండును.

* తుమ్మగుంతలో ఇచ్చి పోగొట్టుకొన్నవాడు, దండిగుంటలో ఇచ్చి రాబట్టుకున్నవాడు.

* తుమ్మతోపుల్లో కొత్తకోలాటం.

* తుమ్మ దుడ్డువలె, కాపు కదురువలె.

* తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎన్నాళ్ళుంటుంది?

* తుమ్ముకు తమ్ముడులేడు గానీ, ఆవలింతకు అన్న ఉన్నాడు.

* తుమ్ము తమ్ముడై చెప్పు.

* తుమ్మెదలాడితే వాన తప్పదు.

* తురక ఎంత గొప్పవాడైనా, ఇంతికి పేరు లేదు, తలకు జుట్టులేదు, మొలకు తాడు లేదు.

* తురక కరక భేదికారులే, మొదటిది దగ్గరకు వస్తే చాలు, రెండోది లోపలికి పోవాల.

* తురక కొట్టవస్తే చుక్కెదురని కదలకుంటారా?

* తురక దెయ్యము మంత్రించినట్లు.

* తురక దాసరికి ఈత మజ్జిగ.

* తురక మెచ్చు, గాడిద తన్ను సంకటమే.

* తురకలలో మంచి ఎవరంటే, తల్లి కడుపులో ఉన్నవాడు, గోరీలో ఉన్నవాడు.

* తురకల సేద్యం, పెరికల పాలు. (పెరిక= విశాఖ ప్రంతంలో ఒక జాతి).

* తురకలు తప్పించుకుంటే ఈదులలో, మేకలు తప్పించుకుంటే తుమ్మలలో (ఈదులు=ఈత చెట్ల తోపులు).

* తురకలు లేణు ఊళ్ళో దూదేలులవాడే ముల్లా.

* తురకలవాడకు గంగిరెద్దు పోతే, కోసుకొని తిన్నారట.

* తురకవీధిని సన్యాసి భిక్ష వలె.

* తురక వీఢిలో విప్రునికి పాదపూజ చేసిఏమి? చేయకేమి?

* తురకా దూదేకుల పొత్తులో మురిగీ మర్దార్.

* తురకా (బ)మరకా తిరగేసి నరకా.

* తురాయి పెట్తినవాడి కొలువు, పరాయివాడి పాంపు.

* తులము నాలికకు తొంభై రుచులు.

* తులసి కడుపున దురదగొండి పుట్టినట్లు.

* తులసికోటలో ఉమ్మేసినా వేమిరా? అంటే, యఙ్ఞవేదిక అనుకున్నాను అన్నాడట.

* తులసివనంలో గంజాయి మొక్కవలె.

* తులువనోటికి ఉలవపప్పు.

* తువ్వన వేసిన ఎఱువు, బాపనికి పోసిన నెయ్యి (తువ్వ=ఇసకతెర, ఎర్రనేల).

* తుళ్ళే ఎద్దే గోనె మోసేది.

**********:: తూ ::**********

* ' తూ ' అంటే బలా అన్నదంట.

* తూగి ముందుకు పడడు, తాగి వెనుకకు పడడు.

* తూట్లు మూసి తూములు తెరచినట్లు.

* తూనీగలాడితే తూమెడు వర్షం (వాన).

* తూమెడువడ్లు తూర్పార(న) బట్టేటప్పటికి ఏదుమువడ్లు ఎలుకలు తినిపోయినవి.

* తూర సందులేదు, తోడ నొకడోలు.

* తూరిన డేగేటు (వేటు), విడిచిన కోలేటు (కోల) తప్పవు (తూరుట=ఆకాశం నుండి భూమికి మహావేగంతో దిగి హటాత్తుగా పైబడి మరల ఎగిరిపోవుట).

* తూరిన గుద్ద దెబ్బ, నీతిపట్తు పులిదెబ్బ తప్పవు.

* తూరుపు తలాపి (తలదాపి) దున్నపోతు గూడా పెట్టదు.

* తూరుపు తొమ్మిది, పడమట పది.

* తూర్పున ఇంద్రధనుస్సు, దూరాన వర్షం.

* తూర్పున ఇంద్రధనుస్సు వేస్తే తుంగమడిలోను, పడమర ఇంద్రధనస్సు వేస్తే బండమీదను పశువులను కట్టాలి.

* తూర్పున కొఱ్ఱువేస్తే దుక్కిటెద్దు ఱంకె వేస్తుంది (కొఱ్ఱు=ఇంద్రధనుస్సు).

* తూర్పున తెరవేసింది, తుంగభద్రలో దొడ్డికట్టరా గొల్లోడా. (తెర=వరదగూడు).

* తూర్పున ధనస్సు వేస్తే, తుంగగడ్డకూడా తడవదు, పరమట వేస్తే పల్లాలన్నీ (పెంటగుంటలన్నీ) నిండుతవి.

* తూర్పున వరదగూడు వేస్తే, తుంగపోచయినా తడవదు.

**********:: తృ ::**********

* తృణము మేరువు, మేరువు తృణము.

**********:: తె ::**********

* తెంపులతాళ్ళు, చిల్లుల కడవ.

* తెగబలిసిన ఆబోతెద్దు తా నెక్కదు, ఇంకొకదానిని ఎక్కనీయదు.

* తెగించి దానంచేస్తాను తేరా పిడికెడు డాళ్ళు అన్నట్లు.

* తెగించినదానికి సగుడు మోకాలిబంటి.

* తెగించినవాడికి తెడ్డేలింగం, విదిచినదానికి వీరేశలింగం.

* తెగితే లింగడు ఱాయి (శివలింగము స్థానభ్రష్టమైతే రాయితో సమానం అనుట).

* తెగిన చేను తేమ నోర్చును.

* తెగిన వ్రేలికి సున్నంగూడా పెట్టడు.

* తెగువదారికి తేలు కుట్టితే తెల్లవార్లు కోడి కూసిందట.

* తెగువ దేవేంద్ర పదవి.

* తెగేదాకా బిగించకూడదు (లాగరాదు).

* తెచ్చుకుంటే భోంచెయ్యి జగన్నాయకా ! లేకుంటే ఊరకుండు లోకనాయక.

* తెచ్చుకొన్న చద్ది, తెచ్చుకొన్నవాడిని తిననిస్తే, మన కమ్మతన మెందుకు కాల్చనా?

* తెడ్డుండగా చెయ్యి కాల్చుకున్నట్లు.

* తెడ్డు ఉండగా చేతితో తాకనేల?

* తెడ్డు ఏదీ? అంటే కొయ్య ఏదీ? అన్నట్లు.

* తెడ్డుకేమి తెలుసు కూరల రుచి.

* తెడ్డు నాకి, వ్రతం చెడకొట్టుకున్నట్లు.

* తెనుగు తేట, అరవం అధ్వాన్నం.

* తెరవాటు గాడు కట్టిన బట్టాలాగి మానభంగమని మానునా?

* తెర్లు వదలిన జీదలు వదులుతాయి.

* తెలకపిండి తిన్న కుక్క తోకాడించక మానదు.

* తెలగాన్యపు టెక్కు, నియోగపు నిక్కు (నియోగినిక్కు).

* తెలిక వానికి నువ్వు వండినట్లు.

* తెలియని దెయ్యమికన్నా, తెలిసిన దెయ్యం మేలు.

* తెలిసినవారు ఎదురైతే మనిషి పండ్లికిలిస్తాడు, గుఱ్ఱం సకిలిస్తుంది.

* తెలివి ఒకరి అబ్బసొమ్మా తోటసుబ్బమ్మా?

* తెలివి ఒకరి సొమ్మా గొల్ల గురవమ్మా?

* తెలివికి తల లేకపోయినా, భోజనానికి పొట్ట ఉంది.

* తెలివి మూలం, తెచ్చెర ఘోరం.

* తెలివిగలిగిన పెండ్లాం తెల్లవారిన తరవాత ఏడ్చిందట.

* తెలివిగలిగిన వాళ్ళాను తెలివిగలవాళ్ళ దగ్గరకు పంపి నన్ను నీ దగ్గరికి పంపినారు.

* తెలివితక్కువ, ఆకలెక్కువ.

* తెలివిలేని పట్టుదల, పొయ్యిలో ఇమడని నిప్పు, కళ్ళెంలేని గుఱ్ఱం.

* తెలిసి తెలిసి బొందను పడ్డట్టు.

* తెలిసినవానికి తెలకపిండి, తెలియనివానికి గానుగ పిండి.

* తెలిసినవారికి ముందరనే ఉంది మోక్షం.

* తెలిసేవరకు బ్రహ్మవిద్య, తెలిసిన తర్వాత కూసివిద్య.

* తెల్లగుర్రపు శారవ, నగిరికొలువు కష్టము (శరవ=(చారవ) చాకిరి).

* తెల్లగుర్రాన్ని పల్లనం చేసినట్లు (పల్లనం= జీనువేసి సిద్ధపరచుట, మాలీసుచేయుట)

* తెల్లనివన్నీ పాలా? నల్లనివన్నీ నీళ్ళా?

* తెల్లబియ్యము, పాటి మానిక.

* తెల్లవారితే ఎల్లవారమ్మల బ్రతుకు ఒకటే.

* తెల్లవారిన సంగతి నీకెట్ల తెలిసిందని ఒక రసికుడడిగితే - బయటకి పోవల్సివచ్చింది- అన్నదట పల్నాటి పడుచు, దీపం వెలవెల బారింది- అన్నదట పాకనాటిసీమ వెలయాలు; తాంబూలం అరుచి అయ్యింది - అన్నదట నెల్లూరు నెరజాణ.

* తెల్లవారి లేచినందుకు దోవ తప్పినందుకు సరి.

* తెల్లవార్లు సరసాలాడి తేరకంటే, నా మొగుడనుకొంటానుపో అన్నదట (ఱంకుటాలు).

* తెల్లవార్లూ సరసమాడినా గొల్లవాడే పుట్టె

* తెల్లవారితే చూడు ఎల్లాయి బతుకు.

**********:: తే ::**********

* తేభ్యమెక్కడ తెత్తునయ్యా? తెల్లవారింది. (తేభ్యం=తిండి).

* తేనె అంతా ఒకచోత తెట్టేంతా ఇంకొకచోట.

* తేనె ఉన్నచోట ఈగలుంటాయి.

* తేనెగూర్చియీగ తెరువరులకు నీదె.

* తేనెటీగ తేనె తెరవరి పాలు.

* తేనెటీగలకు తీరుబడిలేని పని.

* తేనె తీసినవాడు చేయి నాకకపోవునా?

* తేనెతుట్టె పున్నానికి పూజ, అమావాశ్యకు ఆరగింపు.

* తేనెతుట్టను రేపి, తియ్యని తేనెను వదలిపోదురా?

* తేనెబోసి పెంచినా ముష్టిచెట్టుకు విషముపోదు.

* తేనెబోసి పెంచినా వేపకు చేదుపోదు.

* తేనెలో బడ్డ ఈగవలె.

* తేరకు దొబ్బరా బూరగబుచ్చన్నా.

* తేరగాడికేమి తెలుసు తెల్లజొన్న నూగు.

* తేరగాడికేమి తెలుసు లంజ ముడ్డినొప్పి.

* తేరగా వచ్చింది తినితిని, మా తమ్ముడూ ఒకడున్నాడన్నట్లు.

* తేర గుఱ్ఱం, తంగెడు బఱికె.

* తేరకు వచ్చింది ఊరకే పోతుంది.

* తేరసొమ్ము, బీరపీచు.

* తేరుండేదాకానే తిరునాళ్ళు.

* తేరుతీసిన నాటి తీర్థంవలె.

* తేలుకు ఎవరు అపకారం చేసినారు?

* తేలుకుట్టిన దొంగవలె.

* తేలుకు పెత్తనమిస్తే, తెల్లవార్లు తెగకుట్టిందట.

* తేలుకు వెరచి పరుగెత్తి, పాముపై బడినట్లు.

* తేలుచూడిమోసి (పిల్లలగని) చచ్చినట్లు.

* తేలు తేలండి అని అరిస్తే మొగవాళ్ళని పిలవ్వే అన్నాడట. మీరు మొగవారు కారా అని పెండ్లామంటే, సమయానికి ఙ్ఞాపకం చేశావు, కఱ్ఱ తెమ్మన్నాడట.

* తేలుమంత్రమైనా రాకున్నా, పాము పదగపై చేయి పెట్టినట్లు.

* తేలువలే కుట్టిపోయినాదు (కొండెములు చెప్పి).

* తేలేనమ్మకు తీపులు మెండు.

* తేళ్ళలో కొండి, పాములలో పడగ (విషం).

**********:: తై ::**********

* తైమాసం (రేయి) తెగబారెడు.

**********:: తొ ::**********

* తొంగున్న సుంకరీ తలమూట దింపమన్నట్లు.

* తొండకు వెలుగు సాక్షి (వెలుగు=కంచె).

* తొండ పరుగు కంపదాకానే.

* తొండ ముదిరితే ఊసరవెల్లి, గొల్ల ముదిరితే పిళ్ళ.

* తొందరకు ఆలశ్యం మొగుడు.

* తొందరగా రమ్మంటే, తిరుగమూత వేసి వస్తానన్నట్లు.

* తొంభై తొమ్మండుగురు పోగై తోలు తెగగోసినారట.

* తొక్కలేనమ్మ తొక్కులో నీళ్ళుపోసిందట.

* తొక్కినా కఱవకపోతే బురదతొస్సురా అన్నట్లు (పామును).

* తొడ పలుచనదానికి తూటు పెద్ద.

* తొట్టిలో ఊచినట్లు, తొడ గిల్లినట్లు.

* తొట్ల అర్భకుల నూతువు, మరి తోచినట్లు గిల్లుదువు.

* తొడ పలుచనగు నింతికి నడిగండిగలు పెద్ద.

* తొడబలం ఉంటే తొంభైమంది ఉన్నట్లు.

* తొడగిల్లి తొట్ల ఊచినట్లు.

* తొడిమ ఊడిన పండు పడకుండా ఉంటుందా?

* తొత్తు కింద తొత్తు, దొప్ప కింద దొప్ప.

* తొత్తు కింద బడితొత్తు.

* తొత్తుకు సివమెత్తినా మ్రొక్కక తీరుతుందా?

* తొత్తుకో మాఱుతొత్తంట.

* తొత్తుక్క బొల్లిమేక (తొత్తుకొక బొల్లిమేకా?).

* తొత్తుది నగలెన్ని ఇడిన దొరసానగునా?

* తొత్తును ఇంటబెట్టి దొరసానిని చెరగొందురా?

* తొత్తువలే పాటుపడి, దొరవలే తిరుగవలె (తినవలె).

* తొడరి ఆలినమ్మి తొత్తును గొన్నట్లు.

* తొఱ్ఱి మెచ్చేది ఉప్పుపిండి.

* తొఱ్ఱోడు మెచ్చేది ఊరిబిండి (ఊరిబిండి=పచ్చడి).

* తొలకరిలో చెరువు నిండినా, తొలిచూలు కొడుకుపుట్టినా మేలు.

* తొలకరి వానలు మొలకలకు తల్లి.

* తొలి ఏకాదశికి తొలి తాటిపండు.

* తొలిగండం తప్పితే తొంభై ఏళ్ళ ఆయుస్సు.

* తొలిచేసిందానికి తల ఎత్తుకోలేకుంటే, వావిలి చెట్టుక్రింద వాడెవడమ్మా?

* తొలిపెండ్లాం తోటకూర, మలిపెండ్లాం మామిడిపండు, మూడోపెండ్లాం ముంతమామిడిపండు (ముంతమామిడి=జీడిపండు).

* తొలిపిల్లకు తొంబై అంగీలు, మలిపిల్లకు మారుదొడగ లేదు.

* తొలి సమర్తకే గూద దిగినట్లు.

**********:: తో ::**********

* తోకకు తొంభై, నాకు నలభై అన్నట్లు.

* తోకతెగిన నక్కవలె.

* తోక ముడుచుకొన్నట్లు.

* తోకలేదుగానీ హనుమంతునంత బంటు.

* తోకలేని గాలిపటం వలె.

* తోకవడ్లు పంటకు వెన్నుకోత నేస్తం (తోకవడ్లు=ఒకవిధమైన అడవిపంట).

* తోకవెంట పెరుమాళ్ళు అన్నట్లు.

* తోకవెంబడి నారాయణా అన్నట్లు.

* తోచీ తోచనమ్మ తోడికోడలు చెల్లెలి పెండ్లికి పోయిందట.

* తోచీ తోచనమ్మ తోడికోడలు పుట్టింటికెడితే, అదీ తోచనమ్మ ఆడబిడ్డ అత్తగారింటికి వెళ్ళిందట.

* తోచీ తోచనమ్మ తోడికోడలు పుట్టింటికెడితే చూచీ చూడనట్లు చూశారట.

* తోటకూరకు చంద్రహారము దెత్తునా?

* తోటకూర నాడైనా చెప్పనైతినిరా కొడుకా అన్నట్లు.

* తోట మూడుబారలు, కాయ ఆరుబారలు.

* తోటలమీద వారికి, పే(పీ)తలమీద బారికి మొగమాట ముండదు.

* తోడంగ తోడంగ తోడెంగ దొరికె.

* తోడిపిల్లను తోడేలు వేసుకపోతే, ఆమడపిల్ల కచ్చివచ్చిందట.

* తోడున్న తొంబదితడవలు.

* తోడేలును గొఱ్ఱెలను కాయబెట్టినట్లు.

* తోడులేక వెళ్ళదు రాచపీనుగ (రాచపీనుగ తోడులేనిదే పోదు).

* తోరణం కట్టగానే పెండ్లి పూర్తి అయినట్లా?

* తోరణము వీరణము లేని పెండ్లి బాజాలు.

* తోలు తియ్యకుండానే తొనలు మింగినట్లు.

* తోలు తొబక దిని కుక్క పెద్దపులైందట.

* తోలు కొరికేవాడు పోతే, బొమికలు నమిలేవాడు వస్తాడు.

**********:: తౌ ::**********

* తౌడు తింటు ఒయ్యారమా?

* తౌడుతిన్నా మూతి తుడుచుకొన్నట్లుండాలి.

* తౌడు తినేవాడికి మీసాలెగబెట్టే వాడొకడు.

**********:: త్రా ::**********

* త్రాగనేరని పిల్లి ఒలకబోసుకున్నదట.

* త్రాగను గంజిలేదు, తలకు ఆటికలి.

* త్రాడు చాలదని బావి పూడ్చుకుంటారా?

**********:: త్రో ::**********

* త్రోయనేర్చుకున్న కుక్క దొంతులు చేర్చునా? (పేర్చునా?)

* త్రోవ దొరతన మెరుగదు, నిద్ర సుఖమెరుగదు.

* త్రోవలో పెట్టి తొక్కేవురా జాణా అన్నట్లు.

**********:: త్యా ::**********

* త్యాగి గానివాని ధర్మ మడుగవచ్చు. 

Comments

Popular posts from this blog

మొక్కలకు నీళ్లు తోడిన దొంగలు

పులి మీసం | Telugu Stories With Moral

కోతి - యువకుడు