కోతి పాట్లు - Telugu Moral Stories For Kids And Students

telugu moral stories for kids
Telugu Moral Stories For Kids

అనగనగా ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది. అడవిలోని జంతువులను చంపి తిని ఆకలి తీర్చుకునేది. ఒక్కోసారి మాత్రం ఎంత వెదికినా దానికి ఆహారం దొరికేది కాదు. అటువంటప్పుడు అది రాత్రిపూట అందరూ నిద్రపోయే సమయంలో అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్లి మేకలను చంపి అడవికి తెచ్చుకుని తింటూ ఉండేది. తోడేలు చేసే పనుల్ని అడవిలో ఉండే ఒక కోతి చాలా కుతూహలంగా గమనించింది. ఆ విషయం తెలుసుకున్న తోడేలు చాలా తెలివిగా తాను చేస్తున్న పనుల గురించి కోతికి గొప్పగా చెప్తుండేది. యజమానులకు తెలియకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి వర్ణించి చెప్పేది. ఆ మాటలు విన్న కోతికి తోడేలు ఊరివాళ్ల కళ్లు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలనిపించింది.

ఒకరోజు కోతి ‘నువ్వు ఆ గ్రామానికి వెళ్లేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్తావా? నీ పనితనం చూడాలనుంది’ అని తోడేలును అడిగింది. అప్పుడు తోడేలు ‘ఈ రోజు రాత్రికే నిన్ను తీసుకెళ్తాను. రాత్రికి సిద్ధంగా ఉండు’ అని చెప్పింది. తన ముచ్చట తీరబోతున్నందుకు కోతి చాలా మురిసిపోయింది. తమ ఊరిలో అప్పుడప్పుడు మేకలు మాయమవుతుండడం ఊరివారు గమనించారు. ఆ సంగతి ఏంటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలను కాపలా కాయసాగారు. ఆ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఆ ఊరిలో ప్రవేశించింది. మేకలను తినడానికి వాటి దగ్గరకు తోడేలు వెళ్లటాన్ని ఆ యువకులు గమనించారు. మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్ధం అయింది. వెంటనే కర్రలతో దాడి చేశారు. పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు. ఆ దెబ్బలకు తట్టుకోలేక కోతి, ‘మీ మేకల్ని తినటానికి వచ్చింది తోడేలు, నేను కాదు కదా! నన్నెందుకు కొడుతున్నారు? వదిలేయండి’ అని అడిగింది.

‘తోడేలుకు సహాయంగా వచ్చావు. నిన్ను మాత్రం ఎలా విడిచిపెడతాం!’ అంటూ కొట్టసాగారు.

 ఆ యువకులు తోడేలువైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడ నుంచి తప్పించుకొని ‘బతుకు జీవుడా’ అనుకుంటూ అడవికి చేరుకుంది. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పని చేయకూడదని లెంపలు వేసుకుంది. అప్పటినుంచి అటువంటి పనులకు దూరంగా ఉండసాగింది.

నీతి: చెడు చేయకపోయినా చెడు చేసే వారి పక్కన ఉంటే ప్రమాదాలు తప్పవు.

Comments

Popular posts from this blog

మొక్కలకు నీళ్లు తోడిన దొంగలు

పులి మీసం | Telugu Stories With Moral

కోతి - యువకుడు