అద్దంలో డబ్బు


telugu moral stories
Telugu Moral Stories

సత్తుపల్లి అనే గ్రామంలో బుద్ధయ్య అనే గ్రామస్థుడు భార్యాబిడ్డలతో జీవిస్తున్నాడు. పేరుకు తగ్గట్టు బుద్ధుడంతటి మంచివాడతను.
       
బుద్ధయ్య ఇంటికి పొరుగున రంగారావు అనే షావుకారు ఉండేవాడు. బుద్ధయ్య ఎంత మంచివాడో రంగయ్య అంత చెడ్డవాడు, స్వార్థపరుడు. బుద్దయ్య మరదలికి పెళ్ళి కుదిరింది. పెళ్ళికి రావటానికి చదివింపులకి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఏం చెయ్యాలో అర్ధం కాలేదు బుద్దయ్యకి. రాత్రంతా ఆ విషయం గురించే ఆలోచిస్తూ పడుకున్నాడు బుద్ధయ్య.
       
ఆ  రాత్రి అతనికి ఓ కల వచ్చింది.
       
ఆ కలలో అతను అప్పుకోసం రంగయ్య దగ్గరకు వెళ్ళి అడిగాడు. అడిగిందే తడవుగా రంగయ్య బీరువాలోంచి డబ్బు తెచ్చి అతని చేతిలో పెట్టాడు.
       
తెల్లారి లేచాక తనకొచ్చిన కల గురించి భార్యకు చెప్పాడు.
       
భార్య ఆలోచించి, తెల్లవారుఝామున వచ్చిన కలలు నిజమవుతాయంటారు. మనకి ఈ సమయంలో అప్పు ఎవరు ఇస్తారు. నీ కల వల్ల నిజం తెలిసింది. నువ్వు వెంటనే వెళ్ళి రంగయ్యకు మన అవసరం చెప్పి డబ్బు అప్పు అడుగు అంటూ చెప్పింది.
       
‘సరే ప్రయత్నం చేస్తాను’  అంటూ అప్పటికప్పుడు బయలుదేరి రంగయ్య దగ్గరకు వెళ్ళి తన అవసరం చెప్పి డబ్బు అప్పు ఇవ్వమని అడిగాడు.
       
‘బుద్ధయ్య! నీకు డబ్బు ఇవ్వాలని ఉంది. కానీ నా చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు’ అన్నాడు.
       
 
బుద్ధయ్య తనకొచ్చిన కల గురించి చెప్పి ‘కలలోలాగా నేను అడగగానే డబ్బు తెచ్చి ఇస్తావనుకున్నాను. నువ్వేంటి చిల్లిగవ్వకూడా లేదంటున్నావు’ అన్నాడు అమాయకంగా.
       
‘నీకు కలలో డబ్బు ఇచ్చానా?’ అనడిగాడు రంగయ్య.
       
‘అవును. అందుకే నీ దగ్గరికి అప్పుకోసం వచ్చాను’.
       
‘సరే… అయితే ఒక పని చెయ్యి. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. ఈరోజు పట్నం వెళుతున్నాను. రేపు డబ్బు వస్తుంది. నా భార్యకు చెప్పి వెళతాను తీసుకో’ అన్నాడు రంగయ్య బుద్ధయ్యతో.
       
‘నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను రంగయ్య!’
       
‘మర్చిపోయినా ఫర్వాలేదు. నా అప్ప్పు తీరిస్తే చాలు. అవును రేపు నేను ఉండను కదా. ఆ అప్పు పత్రం ఇప్పుడే నువ్వు రాసిస్తే బాగుంటుంది’ అన్నాడు రంగయ్య.
       
‘అలాగే…’ అంటూ అప్పటికప్పుడు అప్పు పత్రం రాసిచ్చాడు బుద్ధయ్య. ‘సరే! రేపు వచ్చి డబ్బులు తీసుకుపో’ అంటూ అతన్ని పంపించేసి పట్నం వెళ్ళిపోయాడు రంగయ్య.
       
మర్నాడు పొద్దున్నే రంగయ్య ఇంటికెళ్ళి డబ్బు అడిగాడు బుద్ధయ్య. ‘ఆయన నీకు ఇవ్వమని నాకేం డబ్బు ఇచ్చి వెళ్ళలేదు’ అని సమాధానమిచ్చిందామె.
       
దాంతో ఏం చేయాలో తోచక భార్య చెవికమ్మలు తెలిసిన వాళ్ళదగ్గర తాకట్టు పెట్టి ముందు ఆమెను పంపుతూ రంగయ్య రాగానే డబ్బు తీసుకువస్తానన్నాడు.
       
పట్నం వెళ్లిన రంగయ్య రెండో రోజు తిరిగివచ్చాడు.
       
బుద్ధయ్య వెళ్ళి రంగయ్యను తాను అడిగిన అప్పు డబ్బులు ఇప్పించామన్నాడు. ‘అదేంటి బుద్ధయ్య! మొన్న నువ్వు డబ్బు తీసుకునే కదా నాకు అప్పుపత్రం రాసిచ్చావు’ అంటూ ఆశ్చర్యంగా అడిగాడు రంగయ్య.
       
రంగయ్య తనని మోసం చేశాడన్న విషయం అర్ధమైంది అతనికి. సరాసరి పంచాయతీ పెద్దల దగ్గరకి వెళ్లి జరిగినదంతా చెప్పాడు. వాళ్ళందరికీ బుద్ధయ్య మంచితనం, రంగయ్య చెడ్డతనం రెండూ తెలుసు. అందుకనే ‘బుద్ధయ్య! నువ్వు ఈ విషయంలో మన ఊరిలో పంచాయతీ పెట్టకు. అలా పెడితే రంగయ్య దగ్గర అప్పుపత్రం ఉంది కనుక నువ్వు అతనికి అప్పు చెల్లించాల్సిందేనని మేమంతా తీర్పు చెప్పాల్సి ఉంటుంది. శివపురం వెళ్ళి మర్యాదరామన్నని కలిసి విషయం చెప్పు. ఆయన అయితే ఏదో ఒక ఉపాయంతో రంగయ్య మోసం బట్టబయలు చేసి నిన్ను కాపాడతాడు’ అంటూ సలహా చెప్పారు.
       
అంతకంటే చేయగలిగిందేమీ లేదు కనుక శివపురం చేరి రామన్నకు జరిగిన విషయం మొత్తం వివరించాడు బుద్ధయ్య. బాగా ఆలోచించిన రామన్న రంగయ్యకు కబురుపెట్టాడు.
       
 రంగయ్య వచ్చి రామన్నకు నమస్కరించి నిలబడ్డాడు. ‘మరేం లేదు రంగయ్య! ఈ బుద్ధయ్య నీ దగ్గర అప్పు తీసుకున్నాడటకా. ఆ అప్పు బుద్ధయ్య తీర్చలేక భాదపడుతుంటే నేను ఆ అప్పును  తీర్చినట్లు నాకు కల వచ్చింది. నాకు వచ్చిన కల నిజమో కాదో తెలుసుకుందామని ఈ బుద్ధయ్యను పిలిపించాను. ఇతను నిజమేనన్నాడు. నీ డబ్బులు నీకిచ్చేస్తాను తీసుకుని అప్పు పత్రం ఇచ్చేసెయ్యి’ అన్నాడు.
       
ఊరకనే డబ్బు వస్తోంది కదాని… వెనకా ముందూ ఆలోచించకుండా ‘అలాగేనయ్య అదంతా మీ దయ’ అన్నాడు వినయంగా.
       
రామన్న తన ప్రక్కనున్న యువకులకి సైగచేశాడు. వెంటనే వాళ్ళు ఓ నిలువుటద్దం తీసుకెళ్ళి రంగయ్య ప్రక్క నిలబడ్డారు. రామన్న లేచి అద్దం దగ్గరకు వచ్చి బుద్ధయ్య రాసిచ్చిన అప్పుపత్రం సరిపోను డబ్బును ఆ నిలువుటద్దంలో కనిపించేలా పట్టుకున్నాడు.
       
రంగయ్యకు ఏం అర్ధం కాక బొమ్మలా నిలబడిపోయాడు.
       
‘తీసుకో రంగయ్య! ఆ అద్దంలో కనిపిస్తున్న డబ్బులు తీసుకుని ఆ అప్పుపత్రం ఇచ్చెయ్యి. నాకు వచ్చిన కలలో నీకు అప్పు ఇలాగే తీర్చాను’ అన్నాడు రామన్న.
       
తన బండారం బయటపడిందన్న విషయం రంగయ్యకు తెలిసొచ్చి తన తప్పు క్షమించమని రామన్నను వేడుకొని బుద్ధయ్య అప్పుపత్రం ముక్కలు చేసి తలవంచుకుని వెళ్ళిపోయాడు.
       
‘బుద్ధయ్య! అప్పు పాములాంటిది. కానీ పేదవాడికి ఆ పాముతో కాటు వేయించుకోక తప్పదు. తప్పనిసరయ్యి కాటు వేయించుకుంటే ఫర్వాలేదు కానీ ఇలా ఊరికే కాటువేసే పాముల బారిన పడకు’ అంటూ చెప్పి పంపించేశాడు రామన్న.

Comments

Popular posts from this blog

మొక్కలకు నీళ్లు తోడిన దొంగలు

పులి మీసం | Telugu Stories With Moral

కోతి - యువకుడు