పులితోలు - గాడిద

పూర్వం ఒక గ్రామంలో విలాసుడు అనే చాకలివాడు ఉండేవాడు. అతడు చాలా పిసినారి. అయితే బట్టల మూటలు మోసే ఓపిక లేక ఏలాగోలా చేసి ఒక గాడిదను కొనుక్కున్నాడు. గాడిదను కొనగానే సరిపోతుందా..? దాన్ని మేపాలంటే ఈ చాకలివాడి తలప్రాణం తోకకు వచ్చింది. గాడిదను మేపాలంటే డబ్బులు ఖర్చయిపోతాయన్న బెంగతో చాకలివాడు ఒక ఉపాయాన్ని ఆలోచించాడు.

అదేంటంటే...బాగా పాతదైపోయిన పులితోలును ఒకదాన్ని సంపాదించిన అతడు, దాన్ని గాడిదపై కప్పి, రాత్రుళ్లు గ్రామస్తుల చేలల్లో వదిలివెసేవాడు. ఆ గాడిద చేలల్లో తనకు ఇష్టమైన ఆహారాన్ని కడుపారా తిని చాకలి ఇంటికి వెళ్లిపోయేది. పులితోలు కప్పుకున్న గాడిదను చూసిన ఆ చేలల్లో కావలి ఉండే గ్రామస్తులు... "అయ్యబాబోయ్.. పులి వచ్చింది" అని భయపడి పారిపోయేవారు.


moral stories in telugu
Moral Stories In Telugu


భయం వల్ల గ్రామీణులెవరూ ఆ పులిని ఏంచేయగలం అంటూ ఊరకుండిపోయారు. అయితే ఆ ఊర్లోనే ఉంటున్న ఒక యువకుడికి మంచి ఆలోచన తట్టింది. దాంతో అతడు ఈ పులి సంగతేంటో తేల్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రికే తన పెంపుడు గాడిదలను వెంటబెట్టుకుని పంటపొలానికి కాపలాగా వెళ్ళాడు. ఆ రాత్రి కూడా విలాసుడి గాడిద.. యజమాని కప్పిన పులితోలు ముసుగులో చేలల్లో పడి, పైరుల్ని మేయసాగింది.

అక్కడే పొలానికి కాపలాగా ఉన్న ఆ యువకుడు దీన్ని ఆశ్చర్యంగా చూడసాగాడు. ఇంతలో అతడివద్ద ఉన్న గాడిదలు పులిని చూసిన భయంతో కాబోలు ఓండ్రబెట్టినాయి. చాలా రోజులుగా మౌనంగా మేత మేయటం అలవాటయిన చాకలివాడి గాడిదకు తన జాతివారి అరుపులు వినబడటంతో సంతోషం పట్టలేక పోయింది. వెంటనే అది కూడా గాడిదలకు జవాబుగా ఓండ్రపెట్టసాగింది.

తోలును చూసి పులి అని భ్రమ పడుతున్న ఆ యువకుడు అది నోరుతెరచి ఓండ్ర పెట్టగానే గాడిదగా గుర్తించాడు. తక్షణమే తనవద్దనుండే దుడ్డుకర్రతో ఆ గాడిదకు బడితె పూజ చేశాడు. ఆ రకంగా చాకలివాడి పులితోలు కప్పుకున్న  గాడిద బాధ ప్రజలకు తప్పింది. 

Comments

Popular posts from this blog

మొక్కలకు నీళ్లు తోడిన దొంగలు

పులి మీసం | Telugu Stories With Moral

కోతి - యువకుడు