ఆశపోతు నక్క

 అనగనగా ఓ అడవి. ఆ అడవిలో ఓ నక్క ఉండేది. దాని జిత్తుల గురించి తెలిసిన జంతువులు దాని కంటబడకుండా తప్పించుకుని తిరగసాగాయి. దాంతో అది ఆకులు, అలములు తింటూ ఎలాగోల బతకసాగింది.

neethi kathalu in telugu
Neethi Kathalu Telugu


 ఓ రోజు నీరసంతో నడవలేక నడవలేక ఆహారం కోసం వెతుకుతుండగ దానికి ఒక పిల్లి ఎదురై ‘ఎలా వున్నావు పెద్దమ్మ!' అని పలకరించింది.

నక్క దానికి తన పరిస్థితి చెప్పుకొని బాధపడింది. పిల్లికి నక్క మీద జాలేసింది.

‘అలా అయితే నాతో రా పెద్దమ్మ. ఇక్కడికి దగ్గరలో ఓ ఇంట్లో విందు జరుగుతోంది. ఎవరికంటా పడకుండ ఆ ఇంట్లో దూరి కావలసినంత తిని గుట్టు చప్పుడు కాకుండా బయట పడదాం’ అంటూ వెంట తీసుకెళ్లింది.

రెండూ కలిసి విందు జరిగే ఇంటి కిటికీలోంచి నెమ్మదిగా లోపలికి దూరాయి. పిల్లి ఒక్కొక్క పదార్దాన్నీ కొంచెం కొంచెం రుచి చూసి వదిలేసింది. నక్క మాత్రం అత్యాశతో సుష్టుగా లాగించింది. ఇంతలో ఏదో అలికిడి కావడంతో పిల్లి చెంగున కిటికీలోనుంచి దూరి బయటపడింది. నక్క కూడా ప్రయత్నించింది కానీ వీలు కాలేదు. ఎందుకంటే వచ్చేటప్పుడు డొక్కలు ఎండిపోయి ఉండటాన కిటికీలో నుంచి సులభంగా దూరగలిగింది.ఇప్పుడేమో పొట్టపగిలేట్టు తినడంతో కిటికీలో పట్టలేదు. ఇంతలో ఇంటివాళ్ళు రావడంతో ఓ ఉపాయం ఆలోచించి గుడ్లు తేలేసి చచ్చినట్లు నటించింది.

ఆ ఇంటివాళ్ళు ‘అయ్యయ్యో! మాయదారి నక్క ఇక్కడికొచ్చి చచ్చింది, ఈ ఇంటికేదో  అరిష్టం దాపురించినట్టుంది’ అనుకుంటూ దాని కాలికి తాడుకట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ఊరవతల పారేశారు.

వాళ్ళు వెళ్ళిపోగానే నక్క మెల్లగా లేచి ఒంటికి అంటిన దుమ్ము దులుపుకొని బతుకుజీవుడా అని తిరిగి అడవి దోవ పట్టింది.

నీతి: అత్యాశ అనర్థదాయకం.

Comments

Popular posts from this blog

మొక్కలకు నీళ్లు తోడిన దొంగలు

పులి మీసం | Telugu Stories With Moral

కోతి - యువకుడు