బుజ్జి మేక - పందిపిల్ల

ఒక రైతు కొన్ని మేకలను, కొన్ని పందులను పెంచేవాడు. వాటిలో ఒక బుజ్జి మేక, ఒక  పందిపిల్ల ఉండేవి. బుజ్జిమేకను వాళ్ళమ్మ ఎప్పుడూ చక్కగా స్నానం చేయించి శుభ్రంగా ఉంచేది. పందిపిల్లేమో వాళ్ళమ్మతో పాటు బురదలో తిరిగేది. దాని ఒంటినిండా బురద అంటుకునేది.

Telugu Moral Stories
Telugu Moral Stories

 
పందిపిల్ల ఎదురుపడగానే బుజ్జిమేక ముక్కు మూసుకుంటూ ‘ఛీ… నువ్వు నా దగ్గరకు రాకు. కంపు. అవతలికి పో’ అని చీదరించుకునేది.

పంది పిల్లకేమో ఆడుకోవడానికి స్నేహితులు లేరు. మేక పిల్లతో ఆడుకుందామంటే అదెప్పుడూ పందిపిల్లను అసహ్యించుకునేది.

‘అమ్మా నాకూ స్నానం చేయించవా. ఇలా ఉంటే నాతో మేకపిల్ల ఆడుకోవట్లేదు’ అని తల్లితో అంది పందిపిల్ల. ‘చూడు బంగారం, మనం మనలాగే ఉంటాం. ఇంకోలా ఉండడం మనకు కుదరదు. మన శరీరానికి చెమటపట్టే లక్షణం లేదు. అందుకే ఎప్పుడూ మనం ఒంటిని తడుపుకుంటూ ఉండాలి’ అని తల్లి వివరించి చెప్పింది. 

పందిపిల్లకు ఇదంతా అర్ధం చేసుకునే వయసులేదు. కాసేపు వాళ్ళమ్మతో గుణిగింది. అమ్మ దాన్ని ఎంతో సముదాయించింది.

ఒకరోజు పందిపిల్ల ఒకచోట, మేకపిల్ల ఒకచోట ఆడుకుంటున్నాయి. ఇంతలో దూరంగా ఉన్న కొండలమీదుండే నక్క ఒకటి ఎలా పసిగట్టిందో మేకపిల్లని పట్టుకుందామని అటువైపు వచ్చింది. మేకపిల్ల ఒంటరిగా ఉండడంతో ఆ నక్కకి మరింత వీలు చిక్కినట్టయింది. నక్కి నక్కి వస్తున్న నక్కను చూసింది పంది పిల్ల.

‘ఏయ్ పారిపో త్వరగా పారిపో.. నక్కొస్తోంది.’ అంటూ గట్టిగా కేకలు వేయడమే కాకుండా మేకపిల్ల పైకి దూకబోతున్న నక్కకి అడ్డు వెళ్ళింది.

మేకపిల్లను తగలాల్సిన దెబ్బ పందిపిల్లకు తగిలింది. ఈలోగా పందిపిల్ల అరుపు విన్న రైతు పరుగెత్తుకుని వచ్చాడు. అతన్ని చూడగానే నక్క పారిపోయింది. పందిపిల్ల గాయానికి మందువేసి బాగు చేసాడు రైతు. ప్రాణాలు అడ్డుపెట్టి తన ప్రాణాలు కాపాడిన పందిపిల్ల పట్ల తన ప్రవర్తనను తలుచుకుని సిగ్గుపడింది బుజ్జిమేక. ఆ తరువాత రెండూ ప్రాణస్నేహితులయ్యాయి.

నీతి: స్నేహం చాలా పవిత్రమైనది. 

Comments

Popular posts from this blog

మొక్కలకు నీళ్లు తోడిన దొంగలు

పులి మీసం | Telugu Stories With Moral

కోతి - యువకుడు