ముసలి ఎద్దు - Telugu Stories With Moral

ముసలి ఎద్దు


సీతాపతి అనే రైతు వద్ద ఒక ఎద్దు ఉండేది. అది వయసులో ఉండగా చాలా ఉత్సాహంగా పొలంపనులు చేసి, బండిలాగి సీతాపతికి ఎంతో సహాయంగా ఉండేది. క్రమంగా ఆ ఎద్దు ముసలిదైపోయింది.

సీతాపతి ఒకనాడు సంతకు వెళ్లి బాగా బలిష్టంగా ఉండి, వయసులో ఉన్న వేరొక ఎద్దును తెచ్చుకున్నాడు. అప్పటినుంచి దానికి దండిగా మేతవేసి, కుడితిపెట్టి జాగ్రత్తగా మేపుతుండేవాడు. ముసలి ఎద్దుకు మాత్రం కాస్త ఎండు గడ్డివేసి ఉరుకునేవాడు.

telugu stories with moral
Telugu Stories With Moral


క్రమంగా అది కూడా దండగ అనుకున్న సీతాపతి ఒకరోజు గుంజకు కట్టి ఉన్న ముసలి ఎద్దుని విప్పి ‘నీకు పని చేసే వయసు అయిపోయింది. శక్తి లేదు. ఇక నీవు నాకు దండగ. నీ దారి నీవు చూసుకో’ అని ముసలి ఎద్దును తరిమేశాడు.

ఏడుస్తూ వెళుతున్న ఎద్దుకు క్రిష్ణ అనే బాలుడు ఎదురొచ్చాడు. ఎద్దును చూసి ‘ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగాడు. ముసలి ఎద్దు  తన జాలి గాథ వినిపించింది.

క్రిష్ణ ఒక ఉపాయం ఆలోచించి ముసలి ఎద్దును తీసుకుని సీతాపతి ఇంటికి వెళ్లి ‘ఈ ఎద్దు నీదేకదూ!’ అని అడిగాడు. అవునన్నాడు సీతాపతి. ‘దీన్ని నాకు అమ్ముతావా? నీకు వెయ్యి వరహాలు ఇస్తాను.’ అన్నాడు క్రిష్ణ.

సీతాపతి ఆశ్చర్యపోగా ‘నీకు తెలియదా? ముసలి ఎద్దును ఇంటి ఎదురుగా కట్టేసి, రోజూ దానికి నమస్కరించి, మేతవేసి వెళితే బోలెడు ధనం వస్తుంది’ అని చెప్పాడు.

సీతాపతి తన ముసలి ఎద్దును తీసేసుకుని, నాటినుండి దానికి దండిగా మేతవేసి నమస్కరించి పొలం పనులకు వెళ్ళేవాడు. ఆ ఏడు దండిగా వర్షాలు కురిసి పొలం బాగా పండడంతో బాగా లాభాలు వచ్చాయి. అదంతా ముసలి ఎద్దు వల్లనే అని సంబరపడ్డాడు సీతాపతి.

నీతి: ఏరుదాటాక తెప్ప తగలెయ్యడం మహాపాపం. 

Comments

Popular posts from this blog

మొక్కలకు నీళ్లు తోడిన దొంగలు

పులి మీసం | Telugu Stories With Moral

కోతి - యువకుడు