నాన్న ! నీతో ఓ గంట | Telugu Stories With Moral For Kids And Students

Telugu Moral Stories
Telugu Stories With Moral


ఒక తండ్రి రోజులా చీకటి పడ్డాక చాలా ఆలస్యంగా ఇంటికి చేరుకున్నాడు. ఆఫీసులో పని ఎక్కువగా ఉండడంతో అలసిపోయి చికాకుగా ఉన్నాడు. తండ్రి కోసం అతని పది సంవత్సరాల కొడుకు గుమ్మం దగ్గర ఎదురుచూస్తూ ఉన్నాడు.
 
‘నాన్నా, నిన్నో ప్రశ్న అడగనా?’ సంశయంగా అడిగాడు కొడుకు.

‘ఏమిటి?’

‘గంటకు  నువ్వెంత సంపాదిస్తావు?’

కొడుకు ప్రశ్న వినగానే తండ్రికి చాలా కోపం వచ్చింది. ‘చిన్న పిల్లాడివి నీకెందుకు? అయినా నీకు సంబంధంలేని విషయం ఇది’

‘నాకు తెలుసుకోవాలని ఉంది. ప్లీజ్ చెప్పు నాన్నా!’ కొడుకు ప్రాధేయపూర్వకంగా అడిగాడు.

తండ్రి మనసులో లెక్కించి చెప్పాడు. ‘నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటే… గంటకి రెండొందలు’.

ఒక్క క్షణం ఆ కుర్రాడు ఏదో ఆలోచించి ‘అయితే నాన్నా నాకు ఒక వంద రూపాయలు ఇవ్వవా?’ అన్నాడు.

దానితో తండ్రి తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు. కొడుకుని ఒక చెంపదెబ్బ కొట్టి ‘నీ గదిలోకి వెళ్ళిపో’ అంటూ గద్దించాడు. కుర్రాడు మౌనంగా తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకున్నాడు.

చాలాసేపటి వరకు తండ్రికి కోపం తగ్గలేదు. ‘డబ్బులు మాములుగా అడగవచ్చు కదా! ఎంత ధైర్యం నా సంపాదన కనుక్కుని, నీ అరగంట సంపాదనేగా వంద ఇవ్వమని ఎమోషనల్ బ్లాక్మెయిల్  చేస్తాడా?’.

ఓ గంట తరువాత తండ్రి కోపం కొంచెం తగ్గింది. ‘తను తొందరపడి కొట్టకుండా ఉండాల్సింది. నిజంగా ఏదైనా అవసరం కలిగి డబ్బులు అడిగాడేమో’ అనుకుంటూ కొడుకు గదిలోకి వెళ్ళాడు.

‘సారీ బాబూ, అప్పుడే ఆఫీస్ నుండి వచ్చానుగా, అందుకే చిరాగ్గా ప్రవర్తించాను. ఇదుగో వంద రూపాయలు’ అంటూ వంద నోటు ఇచ్చాడు.

దాన్ని చిరునవ్వుతో అందుకుని కుర్రాడు తన స్టడీ టేబుల్ దగ్గరకు పరుగెత్తాడు. టేబుల్ సొరుగు లాగి అందులోంచి తాను దాచుకున్న డబ్బును పైకి తీసి లెక్కించసాగాడు. అది చూసి తండ్రికి తిరిగి కోపం వచ్చింది. అయినా కంట్రోల్ చేసుకుని ‘నీ దగ్గర డబ్బు పెట్టుకుని మళ్ళీ నన్నెందుకు అడిగావు? అంత డబ్బుతో ఏం చేస్తావు?’.

డబ్బులు లెక్కించడం పూర్తవగానే ఆ కుర్రాడి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ‘నాన్నా ఇప్పుడు నా దగ్గర రెండొందలు ఉన్నాయి. నేను మీ గంట టైమ్ ని కొనుక్కోగలను. నాన్నా, రేపు మీరు ఓ గంట ఇంటికి త్వరగా రండి. మా ఫ్రెండ్సంతా మన ఇంటికి వస్తున్నారు. మీరు మాతో కలిసి గడపాలి’ అని అన్నాడు. తండ్రికి మాట కరువైంది.

నీతి: ఎంత పని ఒత్తిడిలో వున్నా కుటుంబానికి తగు సమయం కేటాయించాలి. 

Comments

Popular posts from this blog

మొక్కలకు నీళ్లు తోడిన దొంగలు

పులి మీసం | Telugu Stories With Moral

కోతి - యువకుడు