నాలుగు పెట్టెలు | Telugu Neethi Kathalu

ఒకరోజు మర్యాద రామన్న దగ్గరికి ఒక విచిత్రమైన తగవు వచ్చింది.

Telugu Moral Stories


నలుగురు అన్నదమ్ముల మధ్య తగవు.

ఆ నలుగురన్నదమ్ముల తగవంటే ఆస్తి తగవు కాక మరేం అయి ఉంటుంది. ఆ నలుగురన్నదమ్ముల తండ్రి చనిపోతూ ఓ వెండిపెట్టె పెద్దవాడి చేతిలో పెట్టి దానితోపాటు ఓ పత్రం కూడా అందించి పెద్దల సమక్షంలో ఆ పత్రంలో ఉన్న ప్రకారం ఆస్తిని పంచుకోమని చెప్పి చనిపోయాడు. ఆ ప్రకారమే ఆ పత్రంలో ఉన్న ప్రకారం ఆస్తులు పంచుకుందామని చూస్తే అందులో ఒకటవ పెట్టె పెద్దవాడికి రెండవది రెండవవాడికి మూడవది మూడవవాడికి నాలుగవది నాలుగవవాడికి అని రాసి ఉంది.

తండ్రి తనకిచ్చిన వెండిపెట్టెను చూస్తే దానిమీద కాటుకతో ఒకటి అని రాసి ఉంది. అది తెరిస్తే లోపల మరొక పెట్టె మీద రెండు అని రాసి ఉంది. అలా పెట్టెలోపల పెట్టెలు ఉన్నాయి. ఎవరి పెట్టెను వాళ్ళు పంచుకున్నారు. పెద్దవాడి పెట్టెలో ఒక కలం తప్ప మరేం లేదు. రెండవ వాడి పెట్టెలో చిన్న ఇటుక ముక్క తప్ప మరేమి లేదు. మూడవవాడి పెట్టెలో చిన్న మట్టి బెడ్డ మాత్రమే ఉంది. నాలుగవ పెట్టెలో రెండు రత్నాలు ఉన్నాయి.

ఆ నలుగురికీ తండ్రి తమకి ఆస్తిని ఎలా పంచాడో అర్థం కాలేదు. అందుకని ఆ నాలుగుపెట్టెలు తీసుకుని రామన్న దగ్గరకు వచ్చి జరిగినదంతా చెప్పి తండ్రి ఉద్దేశ్యం ఏమిటో వివరించమని చెప్పారు. అంతా విన్నాక ‘మీ తండ్రి ఉద్దేశ్యం చెప్పాలంటే మీకున్న ఆస్తులు ఏమిటో ముందు నేను చెబుతాను. అవునో కాదో చెప్పండి' అన్నాడు రామన్న.

 అలాగే అన్నట్లు తలలు ఊపారు ఆ నలుగురూ. ‘మీకు ఒక ఇల్లు, కొంత పొలం తప్ప ఇతర వ్యాపారాలు గానీ ఆస్తులు గానీ లేవు. అలాగే మీలో పెద్దవాడికి మంచి జీతభత్యాలు వచ్చే ఉద్యోగం ఉంది. అవునా? కాదా?’ అనడిగాడు. 

‘మీరు చెప్పింది నిజం' అంటూ ఒప్పుకున్నాడు పెద్దవాడు.

‘అయితే నా తీర్పు చెబుతాను వినండి…! మీలో రెండవవాడికి ఇల్లు, మూడవవాడికి   పొలం చెందుతాయి. ఆఖరివాడు తెలివైనవాడు కనుక ఆ రత్నాలను అమ్ముకుని ఆ డబ్బుతో ఏదన్నా వ్యాపారం చేసుకుని ప్రయోజకుడు కావాలన్నది మీ నాన్నగారి ఉద్దేశ్యం. పెద్ద కొడుకుని బాగా చదివించాను.  అతని అదృష్టం కొద్దీ మంచి ఉద్యోగం దొరికింది కనుక ఇంకా తను ఆస్తి ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన భావించాడు.

 మీ నాన్నగారి ఉద్దేశ్యం అర్థమైంది కదా! అలానే ఆస్తిని పంచుకోండి. వెళ్ళిరండి' అన్నాడు రామన్న. వాళ్ళు నలుగురూ కృతఙ్ఞతలు తెలుపుకుని వెళ్ళిపోయారు.

Comments

Popular posts from this blog

మొక్కలకు నీళ్లు తోడిన దొంగలు

పులి మీసం | Telugu Stories With Moral

కోతి - యువకుడు